జాతర పనుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేస్తే ఎంతటి వా రినైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు. మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి గురువారం ఆయన మేడారంలో ఆకస్మికంగా పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం హరిత హోటల్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈనెల 18న మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని పచ్చదనంగా సుందరీకరించాలన్నారు. డివైడర్లలో సుందరీకరణ మొక్కలు నాటాలని, అవసరమున్న చోట కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. సీఎం పర్యటన సందర్భంగా ఆలయ ప్రాంగణం, రాతి స్తంభాలను వివిధ రకాల పూలతో సుందరీకరించి, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
పడిగాపూర్ హెలీపాడ్‌లో దిగిన మంత్రులు
మేడారం జాతర అభివృద్ధి పనులను పరిశీలించేందుకు మంత్రులు పొంగులేటి, అడ్లూరి లక్ష్మణ్ మే డారానికి మూడు కిలోమీటర్ల దూరంలోని పడిగా పూర్ హెలిపాడ్ వద్ద హెలికాప్టర్‌లో చేరుకున్నారు. పడిగాపూర్ హెలిపాడ్‌లో దిగి నేరుగా గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. గద్దెల ప్రాంగణంలోని ల్యాండ్ స్కేపింగ్, ప్రధాన ద్వారం సీసీ ఫ్లోరింగ్ పనులను పరిశీలించారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే ప్రాంగణ ప్రదేశాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, ఏఎస్పీ మానన్ భాట్, అదనపు కలెక్టర్ సంపత్‌రావు, ఆర్డీఓ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
మేడారంలో అధికారులతో సమీక్ష


