వచ్చే బడ్జెట్‌లో రూ.70 కోట్లు కేటాయిస్తాం
● రాష్ట్ర మంత్రి కొండా సురేఖ
కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయానికి వచ్చే బడ్జెట్‌లో రూ.70 కోట్లు కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని వీరభద్రస్వామిని గురువారం దర్శించుకున్నారు. ముందుగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికా రు. అక్కడి నుంచి త్రిశూల చౌరస్తాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కొత్తకొండ ఆలయ అభివృద్ధి కోసం రూ.70 కోట్లు ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపాదనలు ఇచ్చారని తెలిపారు. భద్రకాళి నుంచి బాసర వరకు ఆలయాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి సబ్‌కమిటీ వేయాలని మంత్రి శ్రీధర్‌బాబుకు తెలిపారన్నారు. భద్రకాళి ఆలయం, వేములవాడ ఆలయ మాడవీధుల నిర్మాణ పనులు, సమ్మక్క–సారలమ్మ ఆలయ పుణరుద్ధరణ పనులు జరుగుతున్నాయన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రూ.70 కోట్లతో దేవాలయానికి సంబంధించి ప్రాకారాలు, మూడ వీధులు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు, అనుమతులు ఇచ్చి భక్తులకు ఉపయోగపడే విధంగా పూర్తి సహకరిస్తున్న మంత్రి సురేఖకు ధన్యవాదాలు తెలిపారు. వారి వెంట దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామాల సునీత, ఆలయ ఈఓ కిషన్‌రావు, కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి, సీఐ పులి రమేష్, తదితరులు పాల్గొన్నారు.


