ప్రజలు సుఖశాంతులతో జీవించాలి
మహబూబాబాద్: ప్రజలు సుఖశాంతులతో జీవించాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. జిల్లా కేంద్రంలోని మాలోత్ కవిత గృహంలో బుధవార భోగి వేడుకలను నిర్వహించారు. గంగిరెద్దుల విన్యాసాలు తిలకించారు. భోగి మంటలు వేసి సంతోషంగా గడిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. అందరూ కలిసి పండుగలు జరుపుకుంటే సంతోషంగా ఉంటుందన్నారు సంక్రాంతి పండుగ మహిళలకు, రైతులకు అత్యంత ఇష్టమన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, వెంకన్న, మహబూబ్ పాషా, రామచంద్రారెడ్డి, లక్ష్మణ్, విజయ్, రాజేష్, రాము తదితరులు పాల్గొన్నారు.
వీరన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు
కురవి: భోగి పండుగను పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. స్వామి, అమ్మవారిని దర్శించుకునేందుకు బారులుదీరారు. మొక్కుల అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.
కుటుంబమంతా ఒకచోట..
డోర్నకల్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి సంతోషంగా గడుపుతున్నారు. మండలంలోని వెన్నారం గ్రామానికి చెందిన 89 సంవత్సరాల మల్లం ప్రమీలకు ఐదుగురు కుమారులు ఉన్నారు. పాతికేళ్ల క్రితం ఆమె భర్త జగన్నాథం చనిపోగా.. పిల్లలు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ప్రమీల వెన్నారంలో నివాసం ఉంటుండగా.. ఏటా కుమారులు, కోడళ్లు, వారి పిల్లలు సంక్రాంతికి స్వగ్రామానికి వచ్చి ఆనందంగా గడుపుతారు. కాగా బుధవారం ఆమె కుమారులు వీరేందర్, హరేందర్, సురేందర్, మహేందర్, దేవేందర్ తమ భార్యాపిల్లలతో సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వచ్చారు. దీంతో ప్రమీల స్వయంగా పిండివంటలు చేసిపెట్టింది. ఏటా సంక్రాంతికి వచ్చి ఆనందంగా గడుపుతామని ప్రమీల కుమారులు తెలిపారు.
విద్యార్థులకు చదవడం, రాయడం నేర్పించాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రాథమిక దశలోనే విద్యార్థులకు చదవడం, రాయడం నేర్పించాలని డీఈఓ రాజేశ్వర్ ఉపాధ్యాయులకు సూచించారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని మోడల్ స్కూల్‌లో ప్రీప్రైమరీ ఉపాధ్యాయులకు కృత్యాల ఆధారితంగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులకు పాటలు, నృత్యాలు, చిత్రలేఖనం, బొమ్మలు తయారు చేయడం నేర్పించాలని, వారిలో సృజనాత్మకతను పెంపొందించాలన్నారు. ప్రీప్రైమరీ పాఠశాలలను బలోపేతం చేయాలని, నాణ్యమైన విద్యనందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షల పర్యవేక్షణ అధికారి మందుల శ్రీరాములు, రిసోర్స్‌పర్సన్లు ప్రవీణ్‌కుమార్, నాగమునిఇ, యాదగిరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రోడ్డును కమ్మేసిన మంచు..
కురవి: మండల కేంద్రంలో బుధవారం ఉదయం మంచుదుప్పటి కప్పుకుంది. కురవి–ఖమ్మం జాతీయ రహదారిపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపంచకుండా మంచు కమ్ముకుంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మంచు రెండు గంటల పాటు కమ్ముకుని ఉంది.
ప్రజలు సుఖశాంతులతో జీవించాలి
ప్రజలు సుఖశాంతులతో జీవించాలి
ప్రజలు సుఖశాంతులతో జీవించాలి


