మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్మాణ పురోగతి, మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు.
హనుమకొండ జిల్లా సన్నద్ధత..
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లా పరిధిలో పరకాల మున్సిపాలిటీ ఉండగా, 22 వార్డులు ఉన్నాయని తెలిపారు. ఓటర్ల ముసాయిదా జాబితాను ఇప్పటికే ప్రదర్శించామని, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి అభ్యంతరాలు స్వీకరించినట్లు చెప్పారు. వాటి పరిష్కారం అనంతరం తుది ఓటర్ల జాబితా కూడా ప్రకటించినట్లు సీఎస్‌కు వివరించారు. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు, రిటర్నింగ్ అధికారుల నియామక ఉత్తర్వులు సిద్ధంగా ఉన్నాయని, మున్సిపల్ ఎన్నికలకు జిల్లా పూర్తిగా సిద్ధంగా ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. వీసీలో హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డా.కన్నం నారాయణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్


