మహాజాతరకు 15 రోజులే..
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు ఇంకా 15 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలో ముందస్తుగా అమ్మవార్లను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలొస్తున్నారు. సోమవారం కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. మొదట జంపన్నాగులో స్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయ ప్రకారం పూజారులు, దేవాదాయశాఖ అధికారులు డోలువాయిద్యాలతో బండా ప్రకాశ్‌కు స్వాగతం పలికారు. ప్రస్తుతం ముందస్తుగా పది రోజుల నుంచి 20 లక్షల మందిపైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు.
14న గుడిమెలిగె పండుగ..
మేడారంలో ఈనెల 14 (బుధవారం) సమ్మక్క పూజారులు గుడిమెలిగె పండుగ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజులు మహాజాతర జరగనుంది. గుడిమెలిగె పండుగ నిర్వహించిన వారం తర్వాత ఈనెల 21న మండమెలిగె పండుగ నిర్వహించనున్నారు. గుడిమెలిగె పండుగతో మహాజాతర పూజా కార్యక్రమాలకు అంకుర్పాణ జరగనుంది. జాతరకు రెండు వారాలు ముందుగా పూజారులు గుడిమెలిగె పండుగ నిర్వహిస్తారు.
సమ్మక్క గుడిపై ఈశాన్యం దిక్కున కొత్త గడ్డి..
పూర్వకాలంలో గడ్డి గుడిసెలు ఉండేవి. గుడిసెలపై గడ్డి తొలగించి కొత్త గడ్డి కప్పడం, గోడలను మట్టితో పూసి ముగ్గులు వేయడం లాంటి పనులు చేసేవారు. కాలక్రమేనా గుడిసెల స్థానంలో భవనాలు నిర్మించారు. దీంతో పూజారులు గుడిని శుద్ధి చేస్తున్నారు. ఆడపడుచులు గుడిలోపల, బయట ముగ్గులతో అలంకరిస్తారు. అడవి నుంచి తీసుకొ చ్చిన కొత్త గడ్డిని సమ్మక్క గుడిపై ఈశాన్యం దిక్కున ఉంచుతారు.
వనదేవతలకు భక్తుల మొక్కులు
ఎల్లుండే గుడిమెలిగె పండుగ
పది రోజుల నుంచి 20 లక్షల
మందికిపైగా ముందస్తుగా తల్లులను దర్శించుకున్నట్లు అంచనా


