విద్యుత్ బిల్లు కలెక్షన్ ఏజెన్సీల సమస్యలు పరిష్కరించ
● టీఎస్‌ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ బిల్ కలెక్షన్ ఏజెన్సీల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్‌లోని టీఎస్‌ఈఈయూ కార్యాలయం పల్లా రవీందర్ రెడ్డి భవన్‌లో విద్యుత్ బిల్ కలెక్షన్ ఏజెన్సీల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బిల్ కలెక్షన్ ఏజెన్సీలు, వాటి ప్రతినిధులు విద్యుత్ సంస్థల్లో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా వీరి సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్ కలెక్షన్ ఏజెన్సీల ప్రతినిధులను ఆర్టిజన్లుగా గుర్తించాలన్నారు. కలెక్షన్ ఏజెంట్లకు వెంటనే సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఆర్టిజన్లుగా గుర్తించి వారిని ఆదుకోవాలని కోరారు. సమావేశంలో టీఎస్‌ఈఈయూ–327 రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం ఐలేశ్, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు పి.మహేందర్ రెడ్డి, కార్యదర్శి కె.శ్రీనివాస్, నాయకులు రమేశ్ బాబు, యుగంధర్, కలెక్షన్ ఏజెంట్స్ సంఘం నాయకులు పాల్గొన్నారు.


