రిజర్వేషన్లపై సందిగ్ధం
● అయోమయంలో ఆశావహులు
● రిజర్వేషన్లు మారుతాయని జోరుగా ప్రచారం
మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా రిజర్వేషన్లు మారుతాయని కొంత మంది మాజీ కౌన్సిలర్లు, అశావహులు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది మాజీ కౌన్సిలర్లు మాత్రం రిజర్వేషన్లు మారవని ఒక వేళ మారితే అన్ని వార్డులు మారుతాయంటున్నారు. ఏది ఏమైనా రిజర్వేషన్లపై జిల్లాలో ఉత్కంఠ కొనసాగుతుంది. వార్డులతోపాటు చైర్మన్ రిజర్వేషన్‌పై కూడా స్థానికంగా చర్చ జరుగుతుంది. రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీల్లో సందిగ్ధత నెలకొంది, అధికారులు మాత్రం ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు.
ముసాయిదా ప్రకారం 65,851 మంది ఓటర్లు
మానుకోట మున్సిపాలిటీ పరిధలో 36 వార్డులు ఉన్నాయి. గత ఎన్నికల ప్రకారం 57,828 మంది ఓటర్లు ఉన్నారు. కాగా ఈనెల 1 తేదీన ముసాయిదా ఓటరు జాబితాను ప్రదర్శించారు. ఆ జాబితా ప్రకారం ప్రకారం గతంలో కంటే 8,023 మంది ఓటర్లు పెరిగారు. గత ఎన్నికల్లో వార్డుల సంఖ్య పెరుగగా ఈ ఎన్నికల్లో ఓటర్లు పెరిగారు. అయితే పెరిగిన ఓటర్ల ప్రకారం వార్డుల సంఖ్య కూడా పెరుగుతుందా.. లేక ఉన్న వార్డుల్లోనే పెరిగిన ఓటర్లను సర్దుబాటు చేస్తారా.. అనే విషయంపై చర్చ జరుగుతుంది. కొత్తగా వార్డులు పెరిగే అవకాశం లేదని ప్రస్తుతం అంత సమయం లేదని అధికారులు చెబుతున్నారు. ఈనెల 10వ తేదీన తుది జాబితా ప్రదర్శించవాల్సి ఉండగా ఎన్నికల సంఘం ఈనెల 12నకు మార్పు చేసిన విషయం తెల్సిందే. ఓటరు జాబితాలో కూడా మార్పులు చేశారు. దాంతో ఓటర్ల సంఖ్యలో కూడా చాలా మార్పు వచ్చే అవకాశం ఉంది.
రిజర్వేషన్ల మార్పుపై ప్రచారం
వార్డుల రిజర్వేషన్లు మారుతాయని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఊదాహరణకు 17, 24, 26 వార్డులతోపాటు పలు వార్డులు ఎస్సీకి రిజర్వ్ అవుతాయని ప్రచారం జరుగుతుంది. దాంతో ఆయా వార్డుల్లో ఉన్న ఆశావహులు తెరపైకి వ చ్చి తమకే అవకాశం కల్పించాలని నాయకులను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. మాజీ కౌన్సిలర్లు వారి వార్డుల్లో మళ్లీ గెలవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
మార్పు ఎలా ఉంటుందో..?
కొంత మంది మాజీ కౌన్సిలర్లు, ఆశావహులు తప్పనిసరిగా అన్ని వార్డుల్లో రిజర్వేషన్లు మారుతాయని మారకుంటే అన్ని వార్డులు మారవని భావిస్తున్నారు. కానీ గత ఎన్నికల సమయంలో జరిగిన రిజర్వేషన్ ప్రకారం పది సంవత్సరాలు ఒకే రకమైన రిజర్వేషన్లు ఉంటాయని సమాచారం. అయితే కొన్ని మున్సిపాలిటీలు గ్రేటర్‌లో కలవడం, కొన్ని కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు కావడంతో రిజర్వేషన్లు మారుతాయని భావిస్తున్నారు.
ఆదేశాలు రాలేదంటున్న అధికారులు
మున్సిపల్ అధికారులు, కమిషనర్ రాజేశ్వర్ మాత్రం రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి అదేశాలు రాలేదని చెబుతున్నారు. విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రిజర్వేషన్లు ప్రస్తుత సమయంలో సాధ్యం కాదని అంటున్నారు. వార్డుల సంఖ్య పెంపు ఇతరత్రా ఏ విషయంలో ఎలాంటి ఆదేశాలు రాలేదని పేర్కోన్నారు. ఏదిఏమైనప్పటికీ ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వస్తేనే ఉత్కంఠకు తెరపడనుంది.


