చెరువులో పడి రైతు మృతి
ములుగు రూరల్: చెరువులో పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన కాశిందేవిపేట జీపీ పరిధి రామయ్యపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వాంకుడోత్ బాల్య (56) వ్యవసాయ పనుల నిమిత్తం శనివారం ఉదయం చేను వద్దకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పొలం సమీపంలోని కుంటలు, చెరువుల సమీప ప్రాంతాల్లో వెతకగా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం గ్రామ శివారులోని గాజులగుట్ట చెరువులో శవమై తేలాడు. చేను వద్దకు వెళ్లే క్రమంలో బహిర్భూమికి వెళ్లి చెరువులో పడి ఉంటాడని గ్రామస్తులు భావిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పంచనామా నిర్వహించారు. బాల్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


