ఇక.. వాహన రిజిస్ట్రేషన్ సులభం!
ఖిలా వరంగల్ : వాహన రిజిస్ట్రేషన్ కోసం ఇక నుంచి ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేదు. మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) మాదిరి శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చే బాధ్యతను షోరూం డీలర్లకు అప్పగించింది. ఇందు కోసం రవాణాశాఖ అన్ని ఏరాట్లు చేస్తోంది. ఈ ప్రక్రియ పదిహేను రోజుల్లో అమలయ్యే అవకాశముందని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.
నాన్– ట్రాన్స్‌పోర్టు వాహనాలకు మాత్రమే..
నాన్– ట్రాన్స్ పోర్టు వాహనాలు బైక్, కార్లు రిజిస్ట్రేషన్ కోసం రవాణాశాఖకు వెళ్లి రోజంత పడిగాపులు కాయాల్సిన అవసరం ఇక లేదు. కేంద్ర మోటారు వాహన నియామాలు 1989లోని నియమం 48–(బీ) ప్రకారం అధికారిక ఆటో మొబైల్ డీలర్ ద్వారా విక్రయించిన పూర్తి నిర్మిత వాహనాలకు ఈ సౌకర్యం కల్పించారు. ఇందుకు గాను ప్రభుత్వం నుంచి గత నెల 19న కార్యాచరణ సూచనలు జారీ అయ్యాయి. ఉత్తర్వులు వెలువడిన పదిహేను రోజుల వ్యవధిలో డీలర్లు సాఫ్ట్‌వేర్ వ్యవస్థకు అవసరమైన మార్పులు వెంటనే చేసుకోవాల్సి ఉంటుందని రవాణాశాఖ పేర్కొంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో ఆరు ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో ఇప్పటికే 8 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. రోజుకు 200 పైగా ద్విచక్రవాహనాలు, 20 నుంచి 30 వరకు కార్లు రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. 1,500 పైగా ఫిట్‌నెస్ అవుతాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కంపెనీలకు సంబంధించిన ద్విచక్ర వాహనాలు షోరూంలు 82 ఉండగా కార్ల షోరూంలు 28 ఉన్నాయి. వీటితో పాటు సబ్ డీలర్ షోరూంలు ఉన్నాయి. రోజు 100 వరకు ద్విచక్రవాహనాలు, 5 నుంచి 10లోపు కార్లు విక్రయాలు అవుతాయని డీలర్లు చెబుతున్నారు.
సమయం.. ఖర్చు ఆదా..
అన్ని పన్నులు షోరూం డీలర్లు ముందే వసూలు చేస్తున్నా తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రం మాత్రమే ఇచ్చేవారు. అన్ని పత్రాలు తీసుకుని రిజిస్ట్రేషన్‌కు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ఈ సందర్భంలో రాకపోకలు, రవాణా ఖర్చులు, సమయం వృథా అయ్యేది. ముఖ్యంగా మధ్యవర్తుల ప్రమేయం ఎక్కువ ఉండేది. ఇకపై ఆ సమస్య తీరనుంది. డీలర్ల వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్ కానుంది.
ఫ్యాన్సీ సంఖ్య కావాలంటే అదనం..
ద్విచక్రవాహనం, కారుకు తాము కోరుకున్న నంబర్ లేదంటే ఫ్యాన్సీ సంఖ్య కావాలంటే తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తోపాటు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రవాణాశాఖ నిబంధనలు, అదనపు రుసుం చెల్లిస్తే కావాల్సిన సంఖ్యను రవాణాశాఖ అధికారులు కేటాయిస్తారు. ఇందుకోసం కొంత సమయం పడుతుంది.
డీలర్లకే బాధ్యత అప్పగించిన ప్రభుత్వం
ఆర్టీఏకు వెళ్లాల్సిన అవసరం లేదు
వాహనదారుల్లో ఆనందం..
తీరనున్న ఖర్చులు, సమయం,
రాకపోకల కష్టాలు
కొత్త విధానం ఇలా..
వాహన షోరూంలో కొనుగోలు చేసిన వాహనాన్ని అఽధికారిక డీలరే శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయనున్నారు. అవసరమైన పత్రాలు (ఇన్వాయిస్, ఫారం 21, ఫారం–22, బీమా, చిరునామా రుజువు, వాహన ఫొటోలు మొదలైనవి) డీలర్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అవుతాయి. ఆ తర్వాత అప్‌లోడ్ చేసిన వాహన పత్రాలను రవాణాశాఖ అధికారి పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ) నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా వాహన యజమానికి పంపుతారు. ఈ విధానం అమలుతో ప్రజలకు సమయం ఆదా అవుతుంది. అలాగే, రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన పని తగ్గుతుంది. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా పూర్తవుతుంది. అవసరమైతే రవాణాశాఖ అధికారులు వాహన షోరూంలను తనిఖీ చేస్తారు. దీని వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.


