మరణంలోనూ వీడని స్నేహం..
లింగాలఘణపురం : మరణంలోనూ వారి స్నేహం వీడలేదు. ఆనందంగా పుట్టిన రోజు వేడుకలకు వెళ్లొస్తున్నారు. ఈ సమయంలో మృత్యువు కాటేసింది. కారు.. బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరూ దుర్మరణం చెందారు. ఈ ఘటనతో వనపర్తిలో విషాదం నెలకొంది. చావులోనూ వారి స్నేహబంధం వీడిపోలేదని పలువురు గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం వనపర్తి మర్రితండాకు చెందిన బానోత్ మోతీరామ్(55), దరిపల్లి నర్సింహులు(43) ప్రాణ స్నేహితులు. ఎక్కడికై నా ఇద్దరు కలిసే వెళ్తారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి జనగామలోని ఓ ఫంక్షన్ హాల్‌లో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మనవడి పుట్టిన రోజు వేడుకలు జరగగా ఇద్దరు వేర్వేరుగా వెళ్లారు. వేడుక పూర్తయిన అనంతరం తిరిగి మరో వ్యక్తి బానోత్ నర్సింహులుతో కలిసి ముగ్గురు బైక్‌పై వనపర్తికి బయలుదేరారు. ఈ క్రమంలో జనగామ– సూర్యాపేట రోడ్డుపై నవాబుపేట వద్ద రాత్రి 11.30 గంటల ప్రాంతంలో జమ్మికుంట నుంచి సూర్యాపేట వెపునకు కారులో వెళ్తున్న జమ్మికుంటకు చెందిన కర్నె శ్రీకాంత్.. బైక్‌ను వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మోతీరామ్, నర్సింహులును 108లో జనగామ జనరల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో వ్యక్తి బానోత్ నర్సింహులు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.
క్రూజర్‌లో వస్తే బతికేటోడేమో..
వనపర్తి నుంచి జనగామలోని ఫంక్షన్ హాల్‌కు క్రూజర్‌లో వెళ్లిన దరిపల్లి నర్సింహులు తిరిగి అదే వాహనంలో వస్తే బతికేటోడంటూ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఫంక్షన్‌లో స్నేహితుడు మోతీరామ్ కలవడంతో అక్కడే ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం ఇద్దరం కలిసి బైక్‌పై వెళ్దామని నిర్ణయించుకున్నారు. అప్పటికే ముందుగా బానోత్ నర్సింహులుతో బైక్‌పై వచ్చిన మోతీరామ్ సరేనంటూ ముగ్గురు కలిసి ఫంక్షన్ హాల్ నుంచి బయలుదేరారు. మరో ఐదు కిలో మీటర్లులో స్వగ్రామానికి చేరుకునే సమయంలోనే నవాబుపేట వద్ద కారు.. బైక్‌ను ఢీకొంది. వచ్చిన వాహనంలోనే తిరిగి వెళ్తే ప్రాణాలు పోయేవి కావంటూ కొందరూ కంటతడి పెట్టారు. దరిపల్లి నర్సింహులుకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మోతీరామ్‌కు కొడుకు ఉండగా కూతురు పదిహేనేళ్ల క్రితం డెంగీతో చనిపోగా ఆమె విగ్రహాన్ని మర్రితండాలో ఏర్పాటు చేసి అందులోనే ఆమెను చూసుకుంటున్నాడు. పెద్ద మనిషిగా అందరికీ చేదోడువాదోడుగా ఉండే మోతీరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తండాలో విషాదం నెలకొంది.
నర్సింహులు(ఫైల్)
మోతీరామ్(ఫైల్)
పుట్టిన రోజు వేడుకలకు
వెళ్లొస్తూ మృత్యుఒడికి..
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి స్నేహితుల
దుర్మరణం
నవాబుపేట వద్ద ఘటన..
వనపర్తిలో విషాదం
మరణంలోనూ వీడని స్నేహం..


