ఒకేచోట స్నేహితుల అంత్యక్రియలు
గార్ల: వారిద్దరు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఎక్కడికెళ్లినా ఇద్దరు కలిసే వెళ్లేవారు. ఆడినా, పాడిన ఒకే చోట. విద్యభ్యాసం కూడా ఒకే చోట. అలా ఇద్దరు కలిసి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. అక్కడ గత నెల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు. మరణంలోనూ వారి స్నేహం వీడలేదు. చివరికి అంత్యక్రియల్లోనూ వారి స్నేహ బంధం వీడలేదు. ఇద్దరికి ఒకే దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో మరణంతోపాటు అంత్యక్రియల్లోనూ వారి బంధం విడిపోలేదని కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన పుల్లఖండం నాగేశ్వరరావు, ముల్కనూరు గ్రామానికి చెందిన కడియాల కోటేశ్వరరావు కూతుళ్లు మేఘనరాణి, భావన చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒకే పాఠశాల, ఒకే కళాశాలలో విద్యనభ్యసించారు. ఉన్నత చదువు(ఎంఎస్) కోసం తమ తల్లిదండ్రులను ఒప్పించి కోసం అమెరికా వెళ్లారు. అక్కడ కూడా ఒకే గదిలో ఉండేవారు. ఎంఎస్ పూర్తి చేసిన వీరికి మరో 2 నెలల్లో అమెరికాలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్ర మంలో క్రిస్మస్ సెలవుల్లో స్నేహితులతో కలిసి కాలిఫోర్నియా సమీపంలో గల అలబామ హిల్స్ తిలకించేందుకు గత నెల 28వ తేదీన కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారు బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతిచెందారు. అమెరికాలోని ఎన్నారైల సహకారంతో శనివారం మృతదేహాలు స్వగ్రామాలకు చేరుకున్నాయి. ఇద్దరి తల్లిదండ్రులు అంగీకారంతో ముల్కనూరులో ఒకే చోట పక్కపక్కనే అంత్యక్రియలు పూర్తి చేశారు.
శోకసంద్రంలో గార్ల, ముల్కనూరు గ్రామాలు..
మేఘనారాణి, భావన మృతదేహాలు స్వగ్రామాలకు చేరుకోగానే గ్రామస్తులు వందలాదిగా తరలొచ్చి బోరున విలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య.. మేఘనారాణి, భావనకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వ్యాపారులు దుకాణాలు మూసివేసి స్వచ్ఛందంగా అంతిమయాత్రలో పాల్గొన్నారు. గార్ల పుర వీధుల్లో అంతిమయాత్ర నిర్వహించిన అనంతరం ముల్కనూరులో ఇద్దరి మృతదేహాలకు ఒకే ప్రాంతంలో అంత్యక్రియలు పూర్తిచేశారు.
ముల్కనూరులో మేఘనారాణి, భావన దహన సంస్కారాలు పూర్తి
శోకసంద్రంలో రెండు గ్రామాలు
కన్నీటి వీడ్కోలు పలికిన కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు
ఒకేచోట స్నేహితుల అంత్యక్రియలు


