జలగలంచ అటవీ అందాలు రమణీయం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: జలగలంచ అటవీ అందాలు రమణీయంగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శనివారం జలగలంచ వాగు ప్రాంతంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్‌ను కలెక్టర్ దివాకర్ టీఎస్, డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పట్టణాలు, కాలుష్యానికి దూరంగా ఉన్న జలగలంచ అడవిలో పర్యాటకులు సరదాగా గడపాలన్నారు. ఊటీ, కొడైకెనాల్‌కు దీటుగా ములుగు జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు ఉన్నాయన్నారు. బొగత జలపాతం, పస్రా–తాడ్వాయి మధ్య బ్లాక్ బైర్రీ ఐలాండ్, తాడ్వాయి హట్స్ వద్ద సఫారీ వంటి పర్యాటక కేంద్రాలు పర్యాటకులను ఆకర్షిస్తూ ప్రాచుర్యం పొందాయన్నారు. అనంతరం మంత్రి సీతక్క, అధికారులు జంగిల్ సఫారీ వాహనంలో తిరిగి జలగలంచ అడవి అందాలను వీక్షించారు. ఎత్తైన గుట్టపై ఏర్పాటు చేసిన మంచె పైనుంచి అడవి అందాలను వీక్షించిన మంత్రి సీతక్క.. ప్రకృతి సోయగాలకు ఫిదా అయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి
ధనసరి సీతక్క


