ఆలయం..శిథిల విలాపం
అర్ధాంతరంగా
నిలిచిన పనులు..
త్రికూటలయం పునరుద్ధరణ ఎప్పుడు?
రఘునాథపల్లి: కాకతీయుల కళా ప్రభకు చిహ్నంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక కట్టడాలున్నాయి. ఇందులో ప్రధానంగా వేయిస్తంభాల గుడి, రామ ప్ప తదితర ఆలయాలు ప్రసిద్ధి. వేయిస్తంభాల ఆల య నమూనాతో ఐదు వందల స్తంభాల ఆలయాన్ని కాకతీయులు జనగామ జిల్లా నిడిగొండలో ని ర్మించారు. అద్భుతంగా నిర్మించిన త్రికూటలయం (సూర్య దేవాలయం) నేడు కాలగమనంలో శిథిలమవుతోంది. గతంలో ధూపదీప నైవేద్యాలు అందుకున్న ఈ ఆలయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో శిథిలమవుతూ విలపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని పూర్వ వైభవంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.
సందర్శించి మరచిన ఎమ్మెల్యే..
2025, జనవరి 3వ తేదీన స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిడిగొండలోని త్రికూటలయాన్ని సందర్శించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన అద్భుత ఆలయం శిథిలావస్థకు చేరడంతో పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఎనిమిది నెలలు దాటింది. ఇప్పటికీ చారిత్రక నేపథ్యమున్న ఆలయ మరమ్మతులు ప్రారంభం కాలేదు. ఇప్పటికై నా ఎమ్మెల్యే, ఎంపీ, పురావస్తు శాఖ అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గ్రామస్తుల వినూత్న నిరసనలు
ఆలయ పూర్వ వైభవం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చేందుకు గ్రామస్తులు అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. త్రికూటాలయం వద్ద విద్యార్థులతో నిరసనలు, కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని దీపాలు వెలిగించడం, గురువారం పలు స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛ్ స్మారక్ కార్యక్రమం చేపట్టి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. నేలలో కూరుకుపోతున్న శివలింగాన్ని బయటకు తీశారు. ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామస్తులు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పునరుద్ధరణ పేరిట పురావస్తుశాఖ అధికారులు 1996లో ఆలయాన్ని తీసి కళాకాండాలను పక్కకు పెట్టారు. పునరుద్ధరణ కోసం అప్పటి ప్రభుత్వం ఓ దఫా రూ. 20 లక్షలు, మరో దఫా రూ. 16 లక్షలు మంజూరు చేసింది. సంబంధిత కంట్రాక్టర్ ఆలయం చుట్టూ ప్రహరీ, ఇతర పునర్నిర్మాణ పనులు చేపట్టి నిధుల లేమితో నిర్మాణాన్ని అర్ధాంతంగా నిలిపేశాడు. అంతే కాకుండా ఇక్కడి విలువైన శిల్పాలు చోరీకి గురి కాకుండా చౌకీదారుడిని నియమించగా.. అతనిని ఉప సంహరించడంతో శిల్పాలకు భద్రత లేకుండా పోయింది. కళాఖండాలను పక్కకు పెట్టడంతో నంది విగ్రహం, శివలింగం, పానిపట్టం భూమిలో కూరుకుపోతున్నాయి. ఇక్కడ కళాఖండాలలోని కొన్నింటిని పురావస్తు శాఖ అధికారులు ఇతర ప్రాంతాలకు తరలించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
నిర్వహణ లోపంతో
శిథిలమవుతున్న దుస్థితి
శతాబ్దాల చరిత్ర.. చారిత్రక వారసత్వ సంపద కనుమరుగు
దశాబ్దలకాలంగా పట్టించుకోని అధికారులు
సందర్శించి వదిలేసిన స్థానిక ఎమ్మెల్యే
ఆలయం..శిథిల విలాపం


