నేటినుంచి పత్తి కొనుగోళ్లు బంద్
వరంగల్: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నిబంధనలతో జిన్నింగ్ మిల్లర్లు బేజార్ అవుతున్నారు. కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేసుకుని స్లాట్ బుకింగ్‌తో మిల్లుల్లో అమ్మకాలు చేయడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిన్నింగ్ మిల్లులను ఎల్1, ఎల్2, ఎల్3 కేటగిరీలుగా విభజించడం వల్ల మిల్లర్లలో భేదాభిప్రాయాలు తలెత్తినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో 60 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. దశల వారీగా ఈనెల 15 వరకు 35 మిల్లులు కొనుగోలు చేసేందుకు కేంద్రాలను సీసీఐ ఏర్పాటు చేసింది. ఈమిల్లుల్లో అధిక జిన్నింగ్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ కొనుగోళ్లపై కూడా ఆంక్షలు పెట్టి తక్కువ మొత్తం కేటాయించండంతో నిర్వాహకులు అసంతృప్తిగా ఉన్నారు. అకాల వర్షాలతో పత్తి దిగుబడి తగ్గడం వల్ల ప్రస్తుతం కేటాయించిన మిల్లులకు సరిపోతుందన్న ప్రచారం జరుగుతోంది. దీనివల్ల ఎల్4 తర్వాత ఉన్న మిల్లులకు పత్తి కొనుగోలు చేసే అవకాశం లేకుండా పోయే ప్రమాదం నెలకొంది. పత్తి కొనుగోలు చేయకుంటే ఆయా మిల్లుల నిర్వహణ, పనిచేసే కార్మికులకు ఉపాధి లేకుండా పోతుంది. జిన్నింగ్ మిల్లుల్లో పనిచేసే కార్మికులను నిర్వాహకులు ఇతర రాష్ట్రాల నుంచి రప్పించారు. సీజన్‌కు ముందుగానే వీరితో మిల్లర్లు ఒప్పందం చేసుకున్న విధంగా వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. కార్మికుల వేతనాలు, మిల్లుల నిర్వహణ యాజమానులకు ఆర్థిక భారంగా మారింది. అసోసియేషన్‌లో చర్చించి కొనుగోళ్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దిగుబడి పడిపోవడంతో అన్ని మిల్లుల్లో పత్తి కొనుగోలు చేసేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం, మిల్లర్ల వినతిని సీసీఐ, కేంద్రం పట్టించుకోవడం లేదు.
అధిక వర్షాలతో తగ్గిన దిగుబడి..
ఆరుగాలం కష్టించి పండించిన పంట అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. యురియా కొరత ఆర్థికంగా భారం కాగా, అధిక వర్షాలతో దిగుబడి పడిపోయిందన్న బాధలో రైతులు ఉన్నారు. ఇప్పుడు కొనుగోళ్లు బంద్ అంటూ మిల్లర్లు నిర్ణయం తీసుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అదునుగా గ్రామాల్లో ప్రైవేట్ వ్యాపారులు తమ ఏజెంట్లను పెట్టుకుని పత్తి కొనుగోళ్లు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రైతుల వద్ద కొనుగోలు చేస్తున్న సమయంలో తూకం, ధరల్లో మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్లు చేసిన విధంగా పత్తిని సైతం ప్రభుత్వమే నేరుగా కొనుగోళ్లు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
సీసీఐ నిబంధనలతో మిల్లర్లు బేజార్
ఇబ్బంది పడనున్న పత్తి రైతులు
రాష్ట్ర ప్రభుత్వ వినతిని పట్టించుకోని
కేంద్రం


