సకాలంలో జాతర పనులు పూర్తి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతర అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా కృషి చేస్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఆదివారం మేడారంలో ఆమె మాట్లాడుతూ భక్తులు ఇబ్బందులు పడకుండా అనుకున్న సమయంలోనే పనులు పూర్తి చేస్తామన్నారు. జాతరను విజయవంతం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. రానున్న మేడారం జాతర సందర్భంగా హనుమకొండ జిల్లా కేంద్రం నుంచి తాడ్వాయి మండల కేంద్రం వరకు మహిళలు పలు వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం కల్పించడంతోపాటు వారికి ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
పనులను పరిశీలిస్తూ.. ఆదేశాలిస్తూ.
మేడారంలో జాతర అభివృద్ధి పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. ఆదివారం ఉదయమే అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి సీతక్క మేడారానికి చేరుకుని మాట్లాడారు. జంపన్నవాగులో స్నానఘట్టాలకు రంగులు వేసి సుందరీకరంగా తీర్చిదిద్దాలన్నారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని గద్దైపెకి తీసుకొచ్చే క్రమంలో పూజారులకు ఇబ్బంది కలుకుండా గుట్ట వద్ద అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ధ్వంసమైన ఊరట్టం కాజ్‌వేను మంత్రి సీతక్క పరిశీలించి తాత్కాలికంగా పనులు చేపట్టాలని సూచించారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులను పరిశీలించి పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సీతక్క అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమలలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, జిల్లా వ్యవసాయశాఖ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కల్యాణి, కలెక్టర్ దివాకర్ టీఎస్, ఈఓ వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఇంజనీరింగ్ అఽధికారులు పాల్గొన్నారు. కాగా, బయ్యక్కపేటలోని సమ్మక్క–సారలమ్మను మంత్రి సీతక్క దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ఎక్కడపడితే అక్కడ ఇసుక తీయొద్దు..
జంపన్నవాగులో ఎక్కడపడితే అక్కడ ఇసుక తీయొద్దని మంత్రి సీతక్క.. ఇన్‌చార్జ్ తహసీల్దార్ సురేశ్‌బాబును ఆదేశించారు. జంపన్నవాగులో ఇసుక తీయడం వల్ల భక్తులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ఏదైనా ఒక ప్రదేశంలో ఇసుక తీయాలని సూచించారు. దేవాదాయశాఖ అభివృద్ధి పనులకు లారీల్లో ఇసుక తరలించకుండా ట్రాక్టర్లలో తీసుకెళ్లాలని పేర్కొన్నారు.
గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రి సీతక్క
మేడారంలో క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనుల పరిశీలన


