జీజీహెచ్‌లో శిశువు మృతి
నెహ్రూసెంటర్ : మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం నవజాత శిశువు మృతి చెందింది. అయితే ఈ ఘటనకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ మండలం శనిగపురం శివారు భట్టుతండాకు చెందిన బానోత్ జయశ్రీకి రెండో కాన్పులో పురిటి నొప్పులు రాగా సోమవారం అర్ధరాత్రి 12.30 గంటలకు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో తెల్లవారుజామున 4 గంటలకు వైద్యులు ఆపరేషన్ చేశారు. జయశ్రీ మగశిశువుకు జన్మనివ్వగా ఆ శిశువు మృతి చెందాడు. అయితే తీసుకొచ్చిన వెంటనే చేయకుండా 4 గంటల తర్వాత ఆపరేషన్ చేయడంతోనే శిశువు మృతి చెందాడని, దీనికి వైద్యులు నిర్లక్ష్యం కారణమని మండిపడ్డారు.
రోడ్డుపై బైఠాయించి ఆందోళన..
వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందాడని, ఈ ఘటనలో వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, గిరిజన సంఘాల నేతలు ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. జయశ్రీ నాలుగు గంటల పాటు పురిటి నొప్పులతో బాధపడుతుందని చెప్పినా ఆస్పత్రిలో ఎవరూ పట్టించుకోలేదన్నారు. కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందాడని ఆరోపించారు. టౌన్ సీఐ దేవేందర్ రాస్తారోకో వద్దకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు.
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ
బంధువుల ఆందోళన


