టెన్త్ విద్యార్థులకు అల్పాహారం
గూడూరు: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న పదో తరగతి విద్యార్థులకు ఉపశమనం లభించింది. వారికి ఫిబ్రవరి 16 నుంచి అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతీ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు మూడు నెలలపాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈ విద్యాసంవత్సరంలో కూడా ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే ప్రతీసారి విద్యార్థులకు ప్రభుత్వం, దాతల సహకారంతో అల్పాహారం అందిస్తారు. గతేడాది 38 రోజులపాటు విద్యార్థులకు అల్పాహారం అందించగా, ఈ సంవత్సరం ప్రత్యేక తరగతులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ప్రభుత్వం అల్పాహారం అందించలేదు. దీంతో విద్యార్థులు ఉదయం సాయంత్రం అర్థాకలితో ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నారు. ప్రధానంగా సొంతూరు నుంచి వేరే గ్రామాల్లో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేక తరగతుల కారణంగా ఇంటి వద్ద చేసే టిఫిన్ లాంటివి తినాలంటే ఆలస్యం అవుతుందని తినకుండా రావడం, దీంతో చదువుకునే సమయంలో ఆకలి వేస్తుండడంతో చదువు ఒంటపట్టడం లేదని, అల్పాహారం అందించాలని విద్యార్థులు కోరారు. ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు అల్పాహారం అందించాలని జనవరి 7న ఉత్తర్వులు జారీ చేసింది.
పోషక విలువలతో కూడిన చిరుతిళ్లు
విద్యార్థులకు ప్రతి రోజూ సాయంత్రం ఉడికించిన శనగలు, పెసర్లు లేదా బొబ్బర్లు, పల్లీలు, బెల్లం వంటి పోషకాలతో తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్లు, ఉల్లిపాయ పకోడి వంటివి రోజుకు ఒక్కోరకం చొప్పున విద్యార్థులకు అందించేందుకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.
టెన్త్ విద్యార్థులు 3,777 మంది..
జిల్లా వ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్ పరిధిలో మొత్తం 109 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో మొత్తం 3,777 మంది పదో తరగతి చదువుతున్నారు. మార్చి 10న ప్రారంభం కానున్న వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు జిల్లా విద్యాశాఖ పరిధిలో ప్రతి రోజూ విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి ప్రతి రోజూ రూ.15 చొప్పున ఖర్చు చేసేలా జిల్లాకు 19 రోజులకు కలిపి రూ.10.76 లక్షలు మంజూరయ్యాయి. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు విద్యార్థులకు అల్పాహారం అందించాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా అల్పాహారం అందించే రోజులు తగ్గించడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. కనీసం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచైనా అల్పాహారం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఉత్తర్వులు అందాయి
ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు అల్పాహారం అందించమ ని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున మొత్తం 3,777 మంది పది విద్యార్థులకు రూ.10.76 లక్షలు విడుదల చేసింది.
– రాజేశ్వర్, డీఈఓ
టెన్త్ విద్యార్థులకు అల్పాహారం


