పెండింగ్ పనులు పూర్తి చేయాలి
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
తొర్రూరు: మున్సిపాలిటీలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి సూచించారు. మున్సిపాలిటీ అభివృద్ధి నేపథ్యంలో శనివారం డివిజన్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలో అవసరమైన పనులు, పెండింగ్‌లో ఉన్న పనులు, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా, మౌలిక సౌకర్యాలపై అధికారులతో ఎమ్మెల్యే సుదీర్ఘంగా చర్చించారు. అధికారులు ఆయా శాఖల పరిధిలో చేపట్టిన పనులు, పురోగతి వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తొర్రూరు మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, దానికి అధికారులు సహకరించాలని పేర్కొన్నారు. పట్టణ ప్రజల సౌకర్యార్థం మినీ ట్యాంకు బండ్, డివైడర్ విస్తరణ, మంచినీటి సమస్య తీర్చేందుకు రూ.24 కోట్లతో అమృత్ 2.0 పథకం కింద ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నామన్నారు. యూఐడీఎఫ్ నుంచి రూ.15 కోట్లు మంజూరయ్యాయని, ఈ నిధులతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, పార్కుల ఏర్పాటు, వరద కాలువల నిర్మాణం వంటివి చేపడుతామన్నారు.


