సర్పంచ్‌లు కీలక పాత్ర పోషించాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి
మహమ్మద్ అబ్దుల్ రఫీ
మహబూబాబాద్ రూరల్ : బాల్య వివాహాల నియంత్రణలో సర్పంచ్‌లు కీలకపాత్ర పోషించాల ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ 100 రోజుల ప్రచారంలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో సర్పంచులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహమ్మద్ అబ్దు ల్ రఫీ మాట్లాడుతూ బాల్యాన్ని బాల్యవివాహాల పేరుతో కట్టడి చేయొద్దన్నారు. ప్రతి గ్రామంలో బాలల సమగ్ర అభివృద్ధికి సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అన్నారు. గ్రామంలో బాల్య వివాహం నిర్వహిస్తున్నట్లు తెలిస్తే బాల్య వివాహం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించాలన్నారు. సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శాలిని షాకెల్లి మాట్లాడుతూ సర్పంచులు లోక్ అదాలత్ ప్రయోజనాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ బాల్యవివాహలపై రూపొందించిన లఘు చిత్రాన్ని జిల్లా న్యాయమూర్తి ఆవిష్కరించి ప్రదర్శించారు. కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వ ప్రాధాన్యతను వివరిస్తూ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ రూపొందించిన లఘుచిత్రాన్ని ప్రదర్శించారు.
కారాగారాలు పరివర్తనాలయాలుగా ఉండాలి
ఒకసారి నేరారోపణ ఎదుర్కొంటూ జైలుకు వచ్చినవారు మళ్లీ అటువంటి నేరాలకు పాల్పడొద్దని, సత్ప్రవర్తనతో జీవించాలని జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. మహబూబాబాద్ సబ్ జైలుని త్రైమాసిక తనిఖీల్లో భాగంగా జిల్లా జడ్జి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విచారణ ముద్దాయిలతో మాట్లాడుతూ.. సామాజిక ఆర్థిక, ఇతర కారణాలతోనైనా న్యాయవాదిని నియమించుకునే స్తోమత లేనివారికి న్యాయసేవాధికార సంస్థ నుంచి ఉచిత న్యాయ సహాయం అందుతుందన్నారు. జైలులో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ స్పృహ అనే పథకాన్ని తీసుకొచ్చిందని వివరించారు. కార్యక్రమంలో సబ్ జైల్ సూపరింటెండెంట్ మల్లెల శ్రీనివాసరావు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి.రాజ్ కృష్ణ, పారాలీగల్ వలంటీర్ వీరస్వామి పాల్గొన్నారు.


