బస్టాండ్‌లో చైన్ స్నాచింగ్..
● మహిళ మెడలోని బంగారు గొలుసు అపహరణ
మహబూబాబాద్ రూరల్ : బస్సు ఎక్కుతున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు అపహరణకు గురైంది. ఈ ఘటన శనివారం మహబూబాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న పెద్దపల్లి పద్మలత విధులు ముగిసిన తర్వాత ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని హనుమకొండ వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా ఆమె శరీరంపై ఉన్న చున్నీని ఎవరో కదిలించినట్లు అనిపించింది. అనంతరం ఆమె బస్సు ఎక్కి కూర్చుంటుండగా మెడలోని మూడు తులాల బంగారు గొలుసు కనిపించలేదు. దీంతో చైన్ స్నాచింగ్ అయ్యిందని గుర్తించి బాధితురాలు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


