సఖి చెంతకు తల్లీబిడ్డ..
ఖిలా వరంగల్: మతిస్థిమితం కోల్పోయి నర్సంపేటలో రోడ్డుపై తిరుగుతున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ తల్లీబిడ్డను వరంగల్ సఖీ కేంద్రం అక్కున చేర్చుకుంది. వారిని క్షేమంగా భర్తకు అప్పగించింది. వివరాలిలా ఉన్నాయి. గత నెల 28న నర్సంపేటలో రెండు నెలల పాపతో ఓ మహిళ రోడ్డపై తిరుగుతుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు తల్లీబిడ్డను వరంగల్ సఖి కేంద్రానికి అప్పగించారు. ఇక్కడ ఆశ్రయం పొందే సమయాన సదరు మహిళ పారిపోయే ప్రయత్నం చేసింది. అయితే కేంద్ర ఆదరణతో సదరు మహిళ తనది మధ్యప్రదేశ్ అని, తన పేరు గౌరీ అని, తదితర వివరాలు చెప్పింది. ఆ వివరాల ఆధారంగా భర్త సందీప్‌ను పిలిపించి అతడికి తల్లీబిడ్డను అప్పగించి సోమవారం మధ్యప్రదేశ్‌కు పంపించామని సఖి కేంద్రం నిర్వాహకురాలు శ్రీలత తెలిపారు. కాగా, తన భార్య రెండు నెలల చిన్నారిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయి పదిరోజులు అవుతుందని సందీప్ తెలిపారు. ఈ సమయంలో పలుచోట్లు వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లీబిడ్డ చనిపోయారని ఆందోళన చెందామని కన్నీరు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తన భార్య, పాపను చేరదీసి అప్పగించిన సఖీ కేంద్రానికి సందీప్ కృతజ్ఞతలు తెలిపారు.
అక్కున చేర్చుకుని భర్తకు అప్పగించిన వరంగల్ సఖి కేంద్రం
కృతజ్ఞతలు తెలిపిన సందీప్


