వైరా: రైతులు ఎప్పటికప్పుడు కాలానికి అనుగుణంగా పంటలు సాగు చేసుకోవాలని.. తద్వారా నష్టం లేకుండా అధిక దిగుబడులు సాధించొచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఎం.బలరామ్ తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం నిర్వహించిన మధ్య తెలంగాణ మండల (ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మెదక్) వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా సంఘం సమావేశంలో పాల్గొన్నారు. తొలుత రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం బలరామ్ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు, మార్కెట్‌లో డిమాండ్‌ను తెలుసుకుంటూ పంటల సాగులో మెళకువలు పాటిస్తే ఫలితం ఉంటుందని తెలిపారు. అనంతరం యూనివర్సిటీ విస్తరణ సంచాలకుడు డాక్టర్ ఎం.యాదాద్రి, మధ్య తెలంగాణ రీజియన్ సహాయ పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి, మల్యాల కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ మాలతి, మధిర వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రుక్మిణీదేవి మాట్లాడారు. కార్యక్రమంలో వ్యవసాయ విశ్వ విద్యాలయం డైరెక్టర్లు, వివిధ విభాగాల ప్రధాన శాస్త్రవేత్తలు, ఉమ్మడి ఖమ్మం, మెదక్, వరంగల్ జిల్లాల వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ఆదర్శ రైతులు పాల్గొన్నారు.
జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకుడు బలరామ్


