సర్వీస్‌ సీనియార్టీనా? ప్రొఫెసర్‌ సీనియార్టీనా? | - | Sakshi
Sakshi News home page

సర్వీస్‌ సీనియార్టీనా? ప్రొఫెసర్‌ సీనియార్టీనా?

Jun 26 2024 1:34 AM | Updated on Jun 26 2024 10:28 AM

డీన్‌ అపాయింట్‌ డిలే !

డీన్‌ అపాయింట్‌ డిలే !

కేయూ క్యాంపస్‌: కేయూ సైన్స్‌ డీన్‌ నియామకంలో యూనివర్సిటీ అధికారులు జాప్యం చేస్తున్నారు. సైన్స్‌ డీన్‌గా కొనసాగుతున్న గణిత శాస్త్ర విభాగం ప్రొఫెసర్‌, ప్రస్తుత కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య మల్లారెడ్డి సైన్స్‌ డీన్‌ పదవీకాలం గత నెల 31న ముగిసింది. 21 రోజులు గడిచినా.. మరో ప్రొఫెసర్‌ను డీన్‌గా నియమించలేదు. సైన్స్‌ విభాగాల్లో పీహెచ్‌డీ వైవాలు, సెమినార్ల నిర్వహణ బాధ్యతలతోపాటుగా కీలకమైన సెనెట్‌లోనూ, స్టాండింగ్‌ కమిటీలోని సభ్యుడిగా కూడా డీన్‌ కొనసాగుతారు. అలాంటి కీలకమైన పదవి నియామకంలో జాప్యం జరగడం యూనివర్సిటీలోని ప్రొఫెసర్లలో చర్చనీయాంశంగా మారింది.

ఇద్దరిలో ఎవరిని నియమించాలి?
డీన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్‌ మల్లారెడ్డి తర్వాత సైన్స్‌ విభాగాల్లో ఎవరు సీనియర్‌ ఫ్రొఫెసర్‌గా ఉన్నారో ఆ ప్రొఫెసర్‌ను డీన్‌గా నియమించాల్సి ఉంటుంది. అయితే కెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్‌ జి.హనుమంతు, ఫిజిక్స్‌ విభాగంలో ప్రొఫెసర్‌ బి.వెంకట్రామ్‌రెడ్డి ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరిని నియమించాలి. వీరిలో ఎవరిని నియమిస్తారనేది ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. మొదట సర్వీస్‌లో జాయిన్‌ అయినప్పటి నుంచి సీనియార్టీని పరిగణనలోకి తీసుకోవాలా? లేక పదోన్నతి పొందినప్పటి నుంచి సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోవాలా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. కాగా.. గతంలో ఈ రెండు విధానాలనూ అనుసరించడంతో ప్రస్తుతం ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. రెండేళ్ల క్రితం అప్పటి వీసీ తాటికొండ రమేశ్‌ సర్వీస్‌లో మొదట జాయిన్‌ అయిన అంశాన్ని సీనియార్టీగా కాకుండా ప్రొఫెసర్‌గా నియమితులైన తర్వాత సీనియార్టీని పరిగణనలోకి తీసుకొని సైన్స్‌ డీన్‌గా గణిత శాస్త్ర విభాగం ఆచార్య పి.మల్లారెడ్డిని నియమించారు.

యూనివర్సిటీ యాక్ట్‌లో ఏముందంటే..
యూనివర్సిటీ యాక్ట్‌ ప్రకారం.. డీన్‌ అయ్యేవారు ప్రొఫెసర్‌ అయి ఉండాలని రోటేషన్‌ ప్రకారం అని మాత్రమే ఉందని తెలుస్తోంది. డీన్‌ల నియామాకంలో యూనివర్సిటీ యాక్ట్‌లో నిర్దిష్టమైన విధానం లేకపోవడం వల్ల వీసీలుగా బాధ్యతలను నిర్వర్తించినవారు తమ విచక్షణతోనే ఒక విధానం అంటూ కాకుండా.. రెండు విధానాలు అనుసరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్‌చార్జ్‌ వీసీగా వాకటి కరుణ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

కమిటీ వేయాలని యోచన!
కాగా.. కాకతీయ యూనివర్సిటీలో ఇప్పటికీ రెండు విధానాలను అనుసరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సర్వీస్‌ సీనియార్టీని, మరికొన్ని సందర్భాల్లో ప్రెఫెసర్‌ అయిన వారి సీనియార్టీని డీన్‌లుగా నియమించినట్లు తెలుస్తోంది. కేయూ సైన్స్‌ డీన్‌గా ఎవరిని నియమించాలో తేల్చుకోలేకపోతున్న కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య పి.మల్లారెడ్డి ఈ విషయాన్ని కేయూ ఇన్‌చార్జ్‌ వీసీ వాకాటి కరుణ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం సైన్స్‌ డీన్‌గా ఎవరిని నియమించాలనే విషయంపై ఓ కమిటీ వేయాలనే యోచనలో రిజిస్ట్రార్‌ ఉన్నట్లు సమాచారం. ఆఇద్దరు ప్రొఫెసర్లలో ఒకరిని నియమించేవరకు రిజిస్ట్రార్‌ మల్లారెడ్డినే సైన్స్‌ డీన్‌గా అంటిల్‌ఫర్‌దర్‌ ఆర్డర్‌పై కొనసాగిస్తున్నారు. అయితే కమిటీలో ఉండాలని ఇద్దరు ముగ్గురిని సంప్రదించినా ఎవరూ ముందుకు రావడం లేదని సమాచారం.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement