Warangal District Crime News: ‘క్యాసినో గేమ్‌’ కోసం కన్నం.. ఎలాగైనా డబ్బు సంపాదించాలని.. చివరికీ..
Sakshi News home page

‘క్యాసినో గేమ్‌’ కోసం కన్నం.. ఎలాగైనా డబ్బు సంపాదించాలని.. చివరికీ..

Aug 13 2023 1:20 AM | Updated on Aug 13 2023 11:20 AM

- - Sakshi

వరంగల్‌: ఓ విద్యార్థి ఆన్‌లైన్‌ గేమ్‌ ‘క్యాసినో’కు అలవాటు పడ్డాడు. ఆ గేమ్‌లో భారీగా నగదు పోగొట్టుకున్నాడు. చేసిన అప్పు తీర్చాలి. పోయిన డబ్బు ఎలాగైనా సంపాదించాలనుకున్నాడు. దీనికి చోరీలే మార్గమనుకున్నాడు. ఇంకేముందు తాళం వేసిన ఇళ్లకు కన్నం వేయడం మొదలుపెట్టాడు. చోరీ చేసిన డబ్బుతో ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడుతూ జల్సాలు చేస్తున్నాడు.

ఇలా చోరీలకు పాల్పడుతున్న ఓ విద్యార్థితోపాటు అతడికి సహకరించిన స్నేహితుడు శనివారం ఐనవోలు పోలీసుల చేతికి చిక్కగా వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు శనివారం సాయంత్రం మా మునూరు ఏసీపీ కార్యాలయంలో వరంగల్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ రవీందర్‌ యాదవ్‌ వివరాలు వెల్లడించారు. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన విద్యార్థి టెల్లి సందీప్‌ ఆన్‌లైన్‌ గేమ్‌ ‘క్యాసినో’కు అలవాటు పడ్డాడు. ఈ గేమ్‌ కోసం అప్పు చేశారు. అనంతరం ఆడగా డబ్బు మొత్తం పోగొట్టుకున్నాడు. దీంతో అప్పు తీర్చేందుకు చోరీలు చేయాలని నిశ్చయించుకున్నాడు. తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు చేయడం మొదలెట్టాడు.

ఈ క్రమంలో గతనెల 23న ఐనవోలు మండల కేంద్రంలో పల్లకొండ రాజేష్‌ ఇంట్లో చోరీకి పాల్పడి రూ.80వేల నగదు, బంగారం, వెండి ఆభరణాలను అపహరించాడు. చోరీ చేసిన డబ్బు నుంచి రూ.60 వేలతో ఓ బైక్‌, రూ.30వేలతో ఫోన్‌ కొనుగోలు చేశాడు. అనంతరం జూలై 24న ఖిలా వరంగల్‌ మండలం బొల్లికుంట గ్రామంలో అడ్డ గట్ల ఎల్ల య్య ఇంట్లోకి చోరీకి పాల్పడ్డాడు. రూ.2వేల నగదుతోపాటు 2తులాల బంగారం,వెండి ఆభరణాలు అపహరించాడు. చోరీ చేసిన నగదు నుంచి రూ.2వేలు ఖర్చు చేశాడు. అనంతరం చోరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలను తన స్నేహితుడు జనగామ జిల్లా పెద్దపహాడ్‌ గ్రామానికి చెందిన భూక్య సంపత్‌ వద్ద భద్రపర్చాడు.

ఈ క్రమంలో శనివారం ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో వాహన తనిఖీలు చేస్తున్న ఎస్సై నవీన్‌కుమార్‌.. అనుమానాస్పందగా కనిపించిన సందీప్‌ను అదుపులోకి తీసుకున్నాడు. విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్న సందీప్‌.. ఆ డబ్బు ను తన స్నేహితుడు భూక్య సంపత్‌ వద్ద దాచిన పెట్టినట్లు తెలిపాడు. దీంతో సందీప్‌తోపాటు సంపత్‌ను అరెస్ట్‌ చేసి వారి వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. తల్లిదండ్రులకు తమ పిల్లలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని మొబైల్‌ గేమ్స్‌ అడకుండా చూడాలని డీసీపీ సూచించారు. సమావేశంలో మామునూరు ఏసీపీ సతీష్‌ బాబు, మామునూరు, వర్ధన్నపేట సీఐలు క్రాంతికుమార్‌, శ్రీనివాస్‌, ఎస్సైలు కృష్ణవేణి, నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు.

ద్విచక్రవాహనాల దొంగల అరెస్టు..
వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో బైక్‌లు, తాళం వేసి ఉన్న షట్టర్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సీసీఎస్‌, మట్టెవాడ, సుబేదారి పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసినట్లు క్రెం ఏసీపీ మల్లయ్య శనివారం తెలిపారు. నిందితుల నుంచి సుమారు రూ.6లక్షల విలువైన తొమ్మిది బైక్‌లు, రూ.1.60 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

వరంగల్‌ పోచమ్మమైదాన్‌ చెందిన బరిపట్ల సాయి వరంగల్‌ కమిషనరేట్‌తోపాటు మహబూబాబాద్‌ జిల్లాలో చోరీలకు పాల్పతుండగా పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. గత జూన్‌లో జైలు నుంచి విడుదలైన సాయి మరోమారు చోరీలకు పాల్పడుతుండగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో ఘటనలో హనుమకొండ దీన్‌దయాల్‌ కాలనీ చెందిన బూకరాజు సందీప్‌ వరంగల్‌ కమిషనరేట్‌ పరిధితో పాటు కరీంనగర్‌, ఖమ్మం ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలు చోరీలకు పాల్పడుతుండగా పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.

గత మే నెలలో ఖమ్మం జైలు నుంచి విడుదలైన సందీప్‌ మరోమారు వరంగల్‌ ,హైదరాబాద్‌లో తాళం వెసిన షట్టర్లు, ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పక్కా సమాచారంతో నిందితులను పట్టుకున్నారు. వరంగల్‌, హనుమకొండ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా తమ నేరాలను అంగీకరించారు. వీరి సమాచారంలో మిగతా ద్విచక్రవాహనాలు, నగదుతో పాటు ఇతర చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్‌ ఏసీపీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement