బోగస్‌ ఎన్నికలకు ప్రజాధనం వృథా | - | Sakshi
Sakshi News home page

బోగస్‌ ఎన్నికలకు ప్రజాధనం వృథా

Nov 5 2026 1:46 AM | Updated on Nov 5 2026 1:46 AM

కర్నూలు (టౌన్‌): అప్రజాస్వామికంగా నిర్వహించిన బోగస్‌ ఎన్నికలకు ప్రజాధనం వృథా చేశారని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దూరు సుభాష్‌ చంద్రబోస్‌ విమర్శించారు. ఆయన బుధవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. అధికారం అడ్డుపెట్టుకొని కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ ఎన్నికల్లో నామినేషన్ల నుంచి కూటమి నాయకులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు, దౌర్జన్యాలు చేశారన్నారు. పోలింగ్‌ రోజున బూత్‌లను ఆక్రమించి నిస్సిగ్గుగా రిగ్గింగ్‌, సైక్లింగ్‌ ద్వారా దొంగ ఓట్లు వేసుకున్నారని ధ్వజమెత్తారు. చివరకు కౌంటింగ్‌ కేంద్రాల్లో కొన్ని చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందినా కౌంటింగ్‌ అధికారులపై ఒత్తిడితెచ్చి టీడీపీ అభ్యర్థులు గెలుపొందినట్లు డిక్లరేషన్‌ చేయించుకునే స్థితికి దిగజారరని యద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ ఇంత అరాచకాలు జరగలేదని రాష్ట్రంలో గత నాలుగు దశాబ్దాలుగా ఎన్నికల్లో ఇటువంటి హింస జరగలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలనలో ఇంత హింసాత్మకంగా, దౌర్జన్యంగా ఎన్నికలు నిర్వహించడాన్ని ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. అధికారం ఉపయోగించి అక్రమ మార్గాల్లో గెలుపొందిన కూటమి నాయకులది గెలుపే కాదని విమర్శించారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కూటమికి పాపం పండక తప్పదని హెచ్చరించారు.

కుక్కల దాడిలో

జింక పిల్ల మృతి

డోన్‌ టౌన్‌: మండలంలోని వెంకటాపురం గ్రామ సమీప పొలాల్లో బుధవారం వీధికుక్కలు దాడి చేయడంతో ఒక నెల వయసున్న జింక పిల్ల మృతి చెందింది. గ్రామ సమీపంలోని మాగాణి ప్రాంతంలో వందల సంఖ్యలో జింకలు సంచరిస్తుంటాయి. ఇటీవల జన్మించిన ఒక జింక పిల్ల తల్లితో వెళుతుండగా వీధి కుక్కలు వెంబడించాయి. బెదిరిన తల్లి పారిపోగా జింక పిల్ల కుక్కలకు చిక్కడంతో కొరికి చంపినట్లు పశువుల కాపర్లు తెలిపారు. జింక పిల్ల కళేబరాన్ని కుక్కలు పీక్కుతిన్నట్లు తెలిసింది. అటవీశాఖ అధికారులు ఇక్కడ సంచరించే జింకలను సంరక్షణ కేంద్రాలకు తరలించాలని, దీంతో వాటి సంతతి పెరుగుదలతో పాటు రైతుల పొలాలను కాపాడిన వారు అవుతారని ప్రజలు భావిస్తున్నారు.

7న రగ్బీ జట్ల ఎంపిక

కర్నూల్‌ టౌన్‌: స్థానిక స్పోర్ట్స్‌ అథారిటీ అవుట్‌డోర్‌ స్టేడియంలో ఈనెల 7వ తేదీన ఉమ్మడి జిల్లాస్థాయి సబ్‌ జూనియర్‌ అండర్‌ –15 రగ్బీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా రగ్బీ సంఘం కార్యదర్శి రామాంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2011, 2012, 2013 సంవత్సరాల్లో జన్మించిన బాలబాలికలు ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. ప్రతిభ కనబరచి ఎంపికై న క్రీడాకారులు ఈనెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే రాష్ట్రస్థాయి రగ్బీ సబ్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. ఆసక్తి కలిగి ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఆధార్‌ జిరాక్స్‌ వెంట తీసుకురావాలని సూచించారు.

టిప్పర్‌ ఢీకొని వ్యక్తికి

తీవ్ర గాయాలు

మహానంది: మహానంది మండలం గాజులపల్లె రైల్వేస్టేషన్‌ వద్ద హైవే నిర్మాణం కోసం మట్టిని తరలిస్తున్న టిప్పర్‌ ఢీకొన్న సంఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన ఎర్రమల మద్దిలేటి అలియాస్‌ చిన్న కిట్టు స్కూటర్‌పై ఇంటికి వస్తుండగా వేగంగా దూసుకొచ్చిన టిప్పర్‌ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మద్దిలేటిని స్థానికులు చికిత్స నిమిత్తం 108 వాహనం ద్వారా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ మార్గంలో మట్టి టిప్పర్‌ డ్రైవర్లు వేగంగా వెళ్తుండటం వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం అయ్యన్న నగర్‌ గ్రామస్తులు మట్టి టిప్పర్లను అడ్డుకొని నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే

అనుమానితులపై నిఘా

మహానంది: మహానంది మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా పోలీసులు అనుమానితులపై నిఘా ఉంచారు. ఈ మేరకు మహానందిలోని ఒక కమ్యూనిటీ సత్రం వద్ద కొత్తవారు సంచరిస్తుండటంతో సమాచారం మేరకు బుధవారం రాత్రి పోలీసులు విచారణ చేశారు. అయితే వారు ఓ వివాహానికి హాజరయ్యామని చెప్పడంతో పూర్తి వివరాలు సేకరించి పంపించినట్లు మహానంది పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా దేవస్థానం పరిధిలోని లాడ్జీల్లో గుర్తు తెలియని వారికి, పది నుంచి 15 మంది గుంపులుగా వస్తే వసతి గదులు ఇవ్వవద్దని పోలీసులు ఆదేశించినట్లు వివిధ లాడ్జీల నిర్వాహకులు తెలిపారు. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

సుభాష్‌ చంద్రబోస్‌, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement