ఇంద్రభవనం వీడేదెన్నడు! | - | Sakshi
Sakshi News home page

ఇంద్రభవనం వీడేదెన్నడు!

Sep 1 2026 1:43 AM | Updated on Sep 1 2026 1:43 AM

శ్రీశైలంటెంపుల్‌: ఇల కై లాసమైన శ్రీగిరి క్షేత్రాభివృద్ధిని పర్యవేక్షిస్తూ.. భక్తుల మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ.. దేవస్థానం సొమ్మును కాపాడుతూ ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిన ఓ ఉన్నతాధికారే దేవస్థానం ఆదాయానికి గండి కొడుతున్నారు. భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే కానుకలతో క్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. దేవస్థాన ఉన్నతాధికారి నివాసం ఉండి పరిపాలన సాగించేందుకు గతంలో ప్రత్యేక గృహం లేకపోవడంతో దాతలు నిర్మించిన కాటేజీలను వినియోగించుకుంటూ పాలన సాగించేవారు. దాతలు నిర్మించిన కాటేజీలను వినియోగిస్తే ఆ దాతకు, భక్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి, దేవస్థానానికి రోజువారి అద్దె రూపంలో వచ్చే ఆదాయం కూడా దేవస్థానం కోల్పోతుందని భావించి సుమారు రూ.కోటికి పైగా భక్తుల సొమ్మును వెచ్చించి ఉన్నతాధికారి కోసం భవనం నిర్మించారు. భవనం పూర్తయినప్పటికీ ఇంతవరకు ఆ భవనంలోకి వెళ్లేందుకు ఉన్నతాధికారికి మనసు రావడం లేదు. దీంతో ఇటు కాటేజీ రోజు వారి అద్దె దేవస్థానం కోల్పోవడం, నూతన భవనానికి వెచ్చించి ధనం వృథాగా మారుతుంది. ప్రస్తుతం ఉన్నతాధికారి నివాసం ఉంటున్న కాటేజీ రోజు వారి అద్దె రూ.10 వేలు. నెలకు రూ.3లక్షలు ఇలా సంవత్సరానికి రూ.36 లక్షలు, రెండేళ్లకు రూ.72 లక్షలు. ఉన్నతాధికారి వ్యవహారశైలితో రెండేళ్లలో దేవస్థానం రూ.72 లక్షలు కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా నూతన భవనానికి ఖర్చు చేసిన రూ.కోటికి పైగా సొమ్ము సైతం వృథా అవుతుంది.

దేవదాయ శాఖ ఆదేశాలు బేఖాతర్‌..

కొన్ని నెలల క్రితం ఉన్నతాధికారిగా వచ్చిన ఈయన దేవస్థానం పరిధిలో ఓ దాత భక్తుల సౌకర్యార్థం అధునాతన హంగులతో ఇంద్రభవనం లాంటి కాటేజీని నివాసంగా మార్చుకున్నారు. అ భవనం విశాలవంతం, సౌకర్యవంతంగా ఉండి ‘ఇంద్ర’భవనాన్ని తలపిస్తుండడంతో ఆ భవనాన్ని వదలేక పోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఉన్నతాధికారి తీరుపై దేవస్థానం ఆదాయానికి గండి పడుతున్న విషయం కొన్ని నెలల క్రితం దేవదాయశాఖ మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే కాటేజీని ఖాళీ చేసి నూతన భవనంలోకి వెళ్లాలని దేవదాయ శాఖ ఆదేశించినా బేఖాతర్‌ చేశారు. నూతన భవనంలో చిన్నపాటి మరమ్మతులు ఉన్నాయని త్వరలోనే వెళ్తానంటూ వాయిదాలు వేస్తూ ఇంద్ర భవనాన్ని వదలడం లేదని విమర్శలు ఉన్నాయి.

అయ్యగారి సేవలో

ఏడుగురు ఉద్యోగులు

ఉన్నతాధికారికి సేవలందించేందుకు దేవస్థానంలో వివిధ విభాగాల్లో పనిచేసే ఏడుగురు ఉద్యోగులు ఉన్నారు. అయ్యగారి నివాసం వద్ద ఉదయం ఒకరు, మధ్యాహ్నం ఒకరు, రాత్రి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహిస్తారు. సీసీ, అటెండర్‌, డ్రైవర్‌, వంట మనిషి, స్వీపర్‌, గోవు సంరక్షణకు గోశాల నుంచి ఒక ఉద్యోగి ఇలా ఏడుగురు సిబ్బంది రెండు షిఫ్ట్‌లలో విధులు నిర్వహిస్తారు. ‘భక్తుల సొమ్ము వృథా అవుతే నా కేంటి’ అన్నట్లు వ్యవహరించడంతో ఆ ఉన్నతాధికారి వ్యవహారశైలి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది.

ఆదర్శం మరచిన అధికారి

శ్రీశైల దేవస్థానంలో పనిచేసే అధికారులకు, కింది స్థాయి ఉద్యోగులకు ఉన్నతాధికారి ప్రవర్తన ఆదర్శంగా ఉండాలి. అయితే ప్రస్తుతం దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఉన్నతాధికారి తీరు ఆ విధంగా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధునాతన హంగులతో, అన్ని సౌకర్యాలతో, దేవాలయానికి కూతవేటు దూరంలో రూ.కోటిగా నిధులు వెచ్చించి నిర్మించిన భవనంలోకి ఉన్నతాధికారి మాత్రం వెళ్లరు. సమయానికి రవాణా, భద్రత, అంతర్గత రహదారులు, డ్రైనేజ్‌, తాగునీటి సౌకర్యాలు లేని ఎక్కడో దేవస్థానానికి 8కి.మీ దూరంలోని సున్నిపెంటలో నిర్మించిన దేవస్థాన ఉద్యోగుల వసతి గృహానికి మాత్రం ఉద్యోగులు వెళ్లాల్సిందేనని ఒత్తిడి తీసుకువస్తారని పలువురు ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఇప్పటికై న దేవదాయశాఖ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించి శ్రీశైల దేవస్థానంలో ఉన్నతాధికారి నివాసం ఉంటున్న కాటేజీని ఖాళీ చేయించి, ఉన్నతాధికారి కోసం నిర్మించిన నూతన భవనంలోకి మకాం మార్చి కాటేజీని భక్తులకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు భక్తులు కోరుతున్నారు.

దాత కట్టించిన కాటేజీలో

ఉన్నతాధికారి నివాసం

దేవస్థానం నిర్మించిన

నూతన భవనం నిరుపయోగం

రెండేళ్లలో దేవస్థానం ఆదాయానికి

రూ. 72 లక్షల గండి

శ్రీశైలంలో చర్చనీయాంశంగా

ఉన్నతాధికారి వైఖరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement