● వైఎస్సార్‌సీపీ నేతలను నాలుగు గంటలు స్టేషన్‌లో ఉంచిన సీఐ
డోన్: ఓ కేసులో కండీషన్ బెయిల్ పొంది పోలీసు స్టేషన్‌లో సంతకం పెట్టేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలను సీఐ దాదాపు నాలుగు గంటల పాటు స్టేషన్‌లోనే నిరీక్షించి, నీరసించేలా చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా ఈనెల 23వ తేదీన డోన్ పట్టణంలోని నూతన ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించారని ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు జెడ్పీ చైర్మెన్ ఎర్రబోతుల పాపిరెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు కేసు పెట్టారు. కాగా వారు కండీషన్ బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే కండీషన్ బెయిల్‌లో భాగంగా సోమవారం పోలీస్ స్టేషన్‌లో సంతకం చేసేందుకు ఎంపీపీ రేగటి రాజ్‌శేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు బద్దల రాజ్‌కుమార్‌లతో పాటు పలువురు ఎంపీటీసీలు, నాయకులు పోస్టు ప్రసాద్, రామచంద్రుడు తదితరులు ఉదయం చేరుకున్నారు. సంతకం చేసి వెళ్తుండగా.. సీఐ ఇంతియాజ్ బాషా బయటకు వెళ్తూ ‘తాను తిరిగి వచ్చే వరకు అక్కడే ఉండండి’ అంటూ వెళ్లిపోయారు. దా దాపు నాలుగు గంటలు గడిచినా సీఐ తిరిగి రాలేదు. చివరకు నాయకుల్లో కొందరికి షుగర్ ఉందని, మధ్యాహ్నం భోజనం చేయాలని ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డికి చెప్పడంతో ఆయన పంపించేశారు. అయితే కూటమి నేతల ఒత్తిడి మేరకు సీఐ అలా వ్యవహించారనే విమర్శలు ఉన్నాయి. సీఐ బయటకు వెళ్లిన సమయంలో ఎటువంటి కార్యక్రమాలు కూడా లేవని, కూటమి నేతల వేధింపుల్లో భాగంగానే తమను నాలుగు గంటల పాటు స్టేషన్‌లో ఉంచారని వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శిస్తున్నారు.


