కోడుమూరు రూరల్: ఎక్కడైనా దేవుళ్లకు భక్తులు పాలు, పండ్లు, ఫలహారాలను నైవేద్యంగా పెట్టి పూజిస్తారు. కోడుమూరు కొండపైన వెలసిన శ్రీకొండలరాయుడికి మాత్రం భక్తులు తేళ్లనే నైవేద్యంగా సమర్పించి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి యేడాది శ్రావణమాసంలో వచ్చే మూడవ సోమవారం ఈ వింత ఆచారాన్ని కోడుమూరు ప్రజలు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. విషపురుగులైన తేళ్లను చూస్తే ఎవరికై నా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అయితే కోడుమూరు కొండపైన మాత్రం భక్తులు చిన్న చిన్న రాళ్లను ఎత్తుతూ వాటి కింద ఉండే తేళ్లను ఎలాంటి బెరుకు లేకుండా చేతులతో పట్టుకొని శ్రీకొండలరాయుడుకు సమర్పించడం ఇక్కడ విశేషం. ఒక వేళ తేలును పట్టుకునే క్రమంలో కుట్టినా స్వామి వారి ఆలయం చుట్టు మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే తగ్గిపోతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. సోమవారం సాయంత్రం వేలాదిమంది ప్రజలు కాలినడకన కొండపైకి చేరుకొని శ్రీకొండలరాయుడికి తేళ్లను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండలరాయుడు ఆలయం వద్ద భక్తుల సందడి నెలకొంది.
నాలుకపై,
చేతులపై
తేళ్లను
ఉంచుకున్న
యువకులు


