కర్నూలు(అర్బన్): దివ్యాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాల మెరిట్, తిరస్కరణ జాబితాలను విడుదల చేసినట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్‌ఫాతిమా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాలను తమ కార్యాలయ నోటీసుబోర్డు, డిస్ట్రిక్ట్ వెబ్‌సైట్ https://kurnool.ap.gov.inలో ఉంచినట్లు పేర్కొన్నారు. ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్ –2 (వీహెచ్ జనరల్), జూనియర్ అసిస్టెంట్ ( వీహెచ్ జనరల్), జూనియర్ అసిస్టెంట్ (హెచ్‌హెచ్ జనరల్), జూనియర్ అసిస్టెంట్ (ఓహెచ్ జనరల్ ), జూనియర్ ఆడిటర్ (ఓహెచ్ జనరల్), టైపిస్టు ( వీహెచ్ జనరల్), టైపిస్టు ( హెచ్‌హెచ్ జనరల్ ), ఎల్‌డీ కంప్యూటర్ ( హెచ్‌హెచ్ జనరల్), ఏఎన్‌ఎం గ్రేడ్ –3, (హెచ్‌హెచ్ జనరల్) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫైనల్ మెరిట్ జాబితా, తిరస్కరణ జాబితాలను చూసుకోవాలని ఆమె కోరారు.
మేళిగనూరు ప్రజలకు మొసలి భయం
కౌతాళం: మేళిగనూరు గ్రామ సమీపంలోని రామలింగేశ్వర దేవాలయం వెనుక నీళ్లలో మొసలి తిరుగుతుండటంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రైతులు అటువైపు పొలాలకు వెళ్లలేకపోతున్నారు. కూలీలు సైతం పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఇటీవల హోస్పెట్ డ్యాం నుంచి స్పల్పంగా వదిలిన నీరు తుంగభద్ర నదిలో ప్రవహిస్తోంది. ఈ నీటి ప్రవాహంలో మొసలి వచ్చిందా లేదంటే గతంలో ఉన్నదేనా అన్న అనుమానాలు వస్తున్నాయి. మొసలి నుంచి తమను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
యోగా పోటీల్లో ఆదోని విద్యార్థిని ప్రతిభ
ఆదోని అర్బన్: విశాఖపట్నం వేదికగా నిర్వహించిన 51వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి యోగా స్పోర్ట్స్ చాంపియన్‌షిప్–2026 పోటీల్లో ఆదోని పట్టణానికి చెందిన నిథాలి డి.జైన్ అద్భుత ప్రతిభ కనబరిచారు. ఆగస్టు 29న జరిగిన పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులతో పోటీపడి నిథాలి రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. ఈనెల 30న ప్రకటించిన ఫలితాల ప్రకారం ఆమె ప్రతిష్టాత్మక జాతీయస్థాయి పోటీలకు అధికారికంగా ఎంపికయ్యారు. స్థానిక లీలాస్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని నిథాలి పట్టణంలోని మహావీర్ డిజిటల్స్ అధినేత దినేష్‌భరత్‌షా కుమార్తె. చిన్న వయసులోనే యోగాలో కఠినమైన ఆసనాలను చక్కగా ప్రదర్శించి న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకున్నారు.
డ్రంకెన్ డ్రైవ్‌లో ఇద్దరికి జైలు శిక్ష
నంద్యాల(వ్యవసాయం)/బేతంచెర్ల: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఇద్దరికి నిందితులకు జైలు శిక్ష పడింది. నంద్యాల ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఆర్‌జీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పోలీసులు శ్రీనివాస నగర్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టగా.. షేక్ ఫయాజ్ పట్టుపడ్డాడు. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరు పరచగా స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ న్యాయమూర్తి మద్దెల శ్రీనివాసరెడ్డి ఏడు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. అలాగే బేతంచెర్లలో పట్టుబడిన రామాంజనేయులుకు జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూరుల్లా రెండు రోజుల శిక్ష విధించినట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు.


