● రద్దీ తోపులాటలో
అపస్మారక స్థితిలోకి మహిళ
పత్తికొండ: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల రద్దీతో ఓ మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన సోమవారం సాయంత్రం పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్‌లో చోటు చేసుకుంది. గుంతకల్ పట్టణంలోని ధర్మవరం గేట్‌కు చెందిన హసీనా తన కుమారుడు దాదా పీరాతో కలిసి ఉదయం వైద్య పరీక్షల కోసం కర్నూలుకు వెళ్లింది. ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించింది. అనంతరం కర్నూలు నుంచి ఏపీ 39యుఎల్ 1662 బస్సులో గుంతకల్‌కు బయలుదేరింది. కూర్చోవడానికి సీటు కూడా దొరికింది. అయితే సాయంత్రం సమయంలో బస్సు పత్తికొండ బస్టాండ్‌కు రాగానే వాష్‌రూమ్ కోసం కిందకు దిగింది. ఆ సమయంలో గుంతకల్ వైపు బస్సులు తక్కువగా ఉంటాయి. దీనికితోడు దాదాపు 3గంటలు పాటు గుంతకల్ వైపు వెళ్లే బస్సులు రాలేదు. దాదాపు 200 మంది ప్రయాణికులు గుంతకల్ వైపు వెళ్లడానికి బస్టాండ్‌లో నిరీక్షిస్తున్నారు. దీంతో వచ్చిన బస్సు కోసం ప్రయాణికులు చుట్టుముట్టారు. ఈక్రమంలో వాష్‌రూమ్ ముగించుకొని బస్సు ఎక్కుతున్న సమయంలో రద్దీ వల్ల ప్రయాణికులు ఒకరికొకరు విపరీతంగా తోసుకున్నారు. తోపులాటలో హసీనా అక్కడే సృహతప్పి పడిపోయింది. బస్సులో ఉన్న కుమారుడు దాదా పీరా గమనించి కిందికి దిగివచ్చి కాసేపు సపర్యలు చేశాడు. విషయం తెలుసుకుని పక్కనే ఉన్న లాడ్జీలో పని చేస్తున్న హనుమాన్, నాగేష్ అనే యువకులు అక్కడికి చేరుకొని కుమారుడు సహాయంతో ఆటోలో పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళను పరీక్షించిన వైద్యులు సృహలో లేనందున ప్రాథమిక చికిత్సలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ అసుపత్రికి రెఫర్ చేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. బస్సులో రద్దీ వల్ల జరిగిన తోపులాట మా అమ్మ ప్రాణాలకు ముప్పు తెచ్చిందని కుమారుడు దాదా పీరా బోరున విలపించాడు. ఇంతటి దారుణమైన ఘటన చోటు చేసుకున్నా ఆర్టీసీ సిబ్బంది తమకేమీ సంబంధం లేనట్లు ఆమెను కిందకు దింపి వెళ్లిపోవడం గమనార్హం.


