● జిల్లా కలెక్టర్‌కు అర్జీ ఇచ్చిన
యువజన నాయకులు
కర్నూలు(సెంట్రల్): దొంగ బిల్లులతో సీజనల్ హాస్టళ్ల నిధులను స్వాహా చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరికి యూఎస్‌ఎఫ్‌ఐ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి, యువజన సమాఖ్య నాయకులు అర్జీ ఇచ్చారు. వెల్దుర్తి, కృష్ణగిరి, తుగ్గలి మండల్లాలోని 30 సీజనల్ హాస్టళ్లను ప్రభుత్వం పొదుపు మహిళలకు ఇస్తే వాటిని పత్తికొండ ఎమ్మెల్యే బంధువులు తీసుకున్నారని అర్జీలో పేర్కొన్నారు. వాటిని వారే నిర్వహణ చేసి దొంగ బిల్లులతో నిధులను కాజేశారని ఉదహరించారు. కర్నూలు బీక్యాంపు గవర్నమెంట్ బాలుర ఉన్నత పాఠశాలకు గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిని నియమించాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ సభ్యుడు గుడిపల్లి సురేందర్ వినతిపత్రం ఇచ్చారు. కర్నూలు రూరల్ మండలం బి.తాండ్రపాడు, పసుపల, సూదిరెడ్డిపల్లె, నూతనపల్లె గ్రామాలకు తాగు, సాగునీటిని అందజేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యుడు బోయ హనుమంతు అర్జీ ఇచ్చారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అధికారులు అర్జీలు స్వీకరించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాలు చూపించాలని, రీఓపెన్, ఇంప్రాపర్ రెడ్రెసల్ కేసులు పూర్తిగా తగ్గిపోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనురాధ, శివ ప్రసాద్ రెడ్డి, రామసుబ్బయ్య పాల్గొన్నారు.


