‘సీమ’ ఎత్తిపోతలపై అసెంబ్లీలో స్పష్టత ఇవ్వాలి
కర్నూలు (టౌన్): రాయలసీమ ఎత్తిపోతల పథకం పునఃప్రారంభంపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. శాసనమండలిలో జరిగిన ఇరిగేషన్ చర్చలో రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంపై వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు టీడీపీ నేతలు సమాధానం చెప్పలేక పారిపోయారన్నారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారని, తానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో క్లోజ్డ్ డోర్స్‌లో మాట్లాడి రాయలసీమలో ఎత్తిపోతల పథకాలను అపేశామని చెప్పారన్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదని, నిజమో, అబద్ధమో చెప్పకుంటే రాయలసీమకు సీఎం చంద్రబాబు తీరని ద్రోహం చేసినట్లే అని అభిప్రాయ పడ్డారు.
బాబుకు ‘ఓటుకునోటు’ భయం!
శ్రీశైలంలో 802 అడుగుల నీటి మట్టం ఉన్నప్పటి నుంచే కల్వకుర్తి, లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ నుంచి ప్రతి రోజు తెలంగాణ ప్రభుత్వం 6. 9 టీఎంసీల నీటిని తోడేస్తున్నారని ఎస్వీ అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో 129 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఆల్మట్టి డ్యామ్ 229 టీఎంసీల సామర్థ్యానికి పెంచేందుకు పనులు జరుగుతున్నాయన్నారు. ఇలా పక్క రాష్ట్రాలు నీటిని వాడుకుంటున్నా చంద్రబాబు ప్రభుత్వం చూస్తూ ఏమీ చేయలేని దుస్థితిలో ఉందన్నారు. ఓటుకునోటు కేసు ఉండటంతో చంద్రబాబు మాట్లాడలేని పరిస్థితి ఉందన్నారు.
రాయలసీమపై ఎందుకంత కక్ష?
రాయలసీమ ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలు ఉండకూడదనే లక్ష్యంతో తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీమలో ఎత్తిపోతల పథకాలు చేపట్టేందుకు రూ. 789 కోట్లు ఖర్చు చేశారని ఎస్వీ మోహన్‌రెడ్డి తెలిపారు. చంద్రబాబు వైఖరితోనే ఈ పనులు నిలిచిపోయాయన్నారు. వర్షాలు వస్తే నీటమునిగే అమరావతిలో నీళ్లు ఎత్తి పోసేందుకు రూ. 6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. అదే రూ. 4 వేల కోట్లు ఖర్చు చేస్తే గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి అవుతుందన్నారు. రాయలసీమ ప్రాంతంపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష అన్నారు. విశాఖలో రూ. వందల కోట్లు విలువ చేసే భూములను 99 పైసలకు కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం కడపలో ఉక్కు పరిశ్రమకు ఎందుకు రాయితీలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
దేవుడు కూడా క్షమించరు
అత్తా కోడళ్లు కలిసి హేరిటేజ్ సంస్థను ముందుకు తీసుకుపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ వ్యవహారంలో గత ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేసి చివరికి రూ. 1200 కోట్ల నష్టానికి కారకుడయ్యారని ఎస్వీ అన్నారు. తిరుమల లడ్డూ వివాదం కన్నా ముందు హేరిటేజ్ సంస్థ షేర్లు రూ.654 ఉంటే ఒక్కసారిగా రూ.338కి పడిపోయాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ పవిత్ర తిరుమల లడ్డూ, శ్రీశైలం ప్రసాదంపై దిగజారుడు ఆరోపణలు చేసినందుకే దేవుడు కూడా క్షమించలేదన్నారు.
కడపలో మార్చి 1న సమావేశం
కడప నగరంలో మార్చి నెల 1న ఆరు జిల్లాలకు చెందిన వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, రైతు, ప్రజా సంఘాల నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ సమావేశం నిర్వహిస్తుసన్నట్లు తెలిపారు. సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. చంద్రబాబు విధానాలతో రాలయసీమ ఎడారి కాకుండా ఇప్పటి నుంచే ఈ ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన ఆవశ్యకత నెలకొందన్నారు. సమావేశానికి నేతలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నేతలు షరీఫ్, పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి, ఎస్‌టీ షేక్ అహమ్మద్, కిషన్, ఫిరోజ్, లాజరస్, పాండు పాల్గొన్నారు.
లేదంటే రాయలసీమ రైతులకు
ద్రోహం చేసినట్లే
ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే
స్పందించాలి
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలి
మార్చి 1న కడపలో
వైఎస్సార్‌సీపీ సమావేశం
పార్టీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి


