అజ్ఞాతంలో బంగారం వ్యాపారి
● రూ.5 కోట్లకు పైగా అప్పులు
● రెండు నెలలుగా మూతపడిన దుకాణం
ఎమ్మిగనూరు రూరల్: పట్టణంలోని సుంకులమ్మ దేవాలయం సమీపంలోని ఓ బంగారం దకాణం యజమాని రెండు నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. వ్యాపారులు, ఇతరుల దగ్గర దాదాపు రూ.5 కోట్లకు పైగా అప్పులు చేసినట్లు తెలుస్తోంది. దుకాణం మూతపడటం, ఇళ్లు ఖాళీ చేసి కుటుంబంతో సహా కనిపించకుండాపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. పెళ్లిళ్లు ఉండటంతో కుదువ పెట్టిన బంగారం విడిపించుకునేందుకు వచ్చిన బాధితులు వ్యాపారి సెల్‌ఫోన్‌కు కాల్ చేయగా స్వీచ్‌ఆఫ్ వస్తుండటంతో మోసపోయామని తెలుసుకున్నారు. పలువురు బాధితులు శుక్రవారం పట్టణ పోలీసులను ఆశ్రయించారు. నందవరం మండలం మిట్టసోమపురానికి చెందిన లింగన్న 2 తులాల బంగారు చైన్ కోసం రూ.2.80 లక్షలు, జొహరాపురం వెంకటేష్ బంగారు చైన్ కోసం రూ.1.30 లక్షలు, కడిమెట్ల మహేష్ తులం బంగారు, బీషన్న అరతులం బంగారం, మిట్టసోమపురం లక్ష్మీ లాంగ్ చైన్ రిపేరికి ఇవ్వటమే కాకుండా, అర తులం చైన్ చేయటానికి రూ.50 వేలు, రంగమ్మ తులం బంగారు చైన్, నందవరం రామలక్ష్మీ 100 తులాల వెండి కుదవపెట్టింది. వీరే కాకుండా వందల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు సమాచారం. ఈ నెల 23న పత్తికొండకు చెందిన షేక్షావలి జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌కు తాను కుదవపెట్టిన బంగారం ఇవ్వటం లేదంటూ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. వ్యాపారి అజ్ఞాతంలోకి వెళ్లే ముందు మాధవరానికి చెందిన రైతు నర్సిరెడ్డి బంగారు ఆభరణాలు చేయటానికి రూ.4 లక్షలు ఇచ్చినట్లు వాపోతున్నాడు.


