మహాదానందం | - | Sakshi
Sakshi News home page

మహాదానందం

Feb 15 2026 7:00 AM | Updated on Feb 15 2026 7:00 AM

మహాదానందం

మహాదానందం

నేడు మహాశివరాత్రి పర్వదినం

జనసంద్రంగా మారిన శ్రీశైలం

పాగాలంకరణకు ఏర్పాట్లు పూర్తి

నిత్యం ఓంకార నాదం.. కొండలు, గుట్టలు దాటుకుని పాదయాత్రగా నల్లమల మీదుగా భారీగా వచ్చే భక్తజనం.. ధూళి దర్శనంతో ‘ధన్యోస్మి’ అంటూ నమస్కారం.. పాతాళగంగలో ‘పుణ్య’ సంకల్పం.. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో అతి ప్రాచీనం వెలుగులీనుతోంది. ‘మహా’ద్భుత ఘట్టానికి సమయం ఆసన్నమైంది. శ్రీగిరిలో ఆదివారం నిర్వహించే పాగాలంకరణతో భారతీయ సంస్కృతి ఆవిష్కృతం కానుంది. నమక, చమకాలతో మహా రుద్రాభిషేకం, అనంతరం ఆది దంపతుల కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా సాగనుంది.

శ్రీశైలంటెంపుల్‌: మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భావకాలంలో శ్రీశైలంలో మల్లన్నకు నిర్వహించే పాగాలంకరణ వెనుక ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిక్షిప్తమై ఉన్నాయి. పాగాలంకరుడైన మల్లన్నను చూసేందుకు భక్తుల రెండు కళ్లు చాలవు. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశాన్ని పంచభూతాలు కాగా.. వీటి ప్రతీకలుగా మల్లన్న ఆలయంలోని ఐదు కలశాలు ఉన్నాయి. గర్భాలయ ముఖమండపంపై తొమ్మిది నందులు ఉండగా వీటితోపాటు ఐదు కలశాలను కలిపి పాగా చుడతారు. మొత్తం పథ్నాలుగు లోకాలకు మల్లన్న అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. మొత్తం 14 చుట్లు చుట్టిన పాగాలంకరణ దర్శనంతో ఇంద్రియాలు నిర్మలమైన బాధల నుంచి విముక్తి పొందుతాయనే విశ్వసిస్తారు.

దిక్కులే వస్త్రాలు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీశైల మల్లన్న కల్యాణం, లింగోద్భావకాలం రెండు ఉత్సవాలకు కలిపి వచ్చేలా పాగాలంకరణ జరుగుతుంది. స్వామివారికి దిక్కులే వస్త్రాలు. అందుకే పాగాలంకరణ సేవ చేసేవారు దిగంబరంగానే ఉండి కార్యాన్ని పూర్తి చేస్తారు. ఆ సమయంలో ఆలయం, పరిసరాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తారు. పాగాలంకరణ పూర్తయ్యాక విద్యుత్‌ వెలుగులు నింపుతారు. ఆదివారం రాత్రి 10 నుంచి 12గంటల లోపు లింగోద్భవ సమయంలో పాగాలంకరణ జరుగుతుంది. ఇందుకోసం ఫృధ్వి సుబ్బారావు పాగా వస్త్రంతో శ్రీగిరికి చేరుకున్నారు. పాగాలంకరణ సమయంలో మల్లన్నకు లింగోద్భావకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది.

నమో..రుద్రాయా!

మహాన్యాసం చేసే ముందు అర్చకులు, పండితులు తమ దేహంలోని ఇంద్రియాలను తాకుతూ రుద్రమంత్రాలను చదువుతూ రుద్రుడిని ఆహ్వానిస్తారు. పరిపూర్ణంగా రుద్రుడి రూపాన్ని దాల్చిన తరువాత యజుర్వేదంలోని రుద్రం, నమక చమక మంత్రాలను ఉచ్ఛరిస్తూ అభిషేకం నిర్వహిస్తారు. నమక చమకాలను ఒకసారి చెప్పి చేసేది ఏకరుద్రాభిషేకం. అలాగే 11సార్లు నమకాన్ని పఠించి ఒకసారి చమకాన్ని చదివి చేసేది ఏకాదశ రుద్రాభిషేకం. ఈ ఏకాదశ రుద్రాభిషేకం ఉకదశ రుద్రులకు ప్రతీక. ఒక్కో అభిషేకంలో ఒక్కో రుద్రుడు అవిష్కృతమవుతాడు. చివరిగా స్వామివారికి నీరాజనం చూపడంతో లింగోద్భవకాల రుద్రాభిషేకం ముగుస్తుంది. తదుపరి రాత్రి 12గంటలకు భ్రమరాంబా సమేత మల్లికార్జునుడికి బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తారు.

గజవాహనంపై ఆదిదంపతులు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా ఏడో రోజు శనివారం భ్రమరాంబా సమేతుడైన మల్లన్న గజవాహనంపై విహరించారు. ముందుగా ఉభయ దేవాలయ ప్రాంగాణంలోని అలంకార మండపంలో ఉత్సవమూర్తులను గజవాహనంపై అధిష్టింపజేశారు. ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, పండితులు వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక అర్చన, హారతి పూజలు చేశారు. అనంతరం గజవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను ఆలయ ప్రదిక్షణ చేయించారు. దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్‌ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవానికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement