‘విశ్వ’మంత సంబరం
● సందడిగా జేఎన్‌టీయూ(ఏ) 14వ స్నాతకోత్సవం
అనంతపురం: రాయలసీమకే తలమానికంగా నిలిచిన అనంతపురం జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ (ఏ) 14వ స్నాతకోత్సవ సంబరం అంబరమంటింది. జేఎన్‌టీయూ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన స్నాతకోత్సవానికి చాన్స్‌లర్ హోదాలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. గౌరవ డాక్టరేట్ గ్రహీత డాక్టర్ చావా సత్యనారాయణ, వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు, ముఖ్య అతిథి, కాన్పూర్ ఐఐటీ ఎమిరటర్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ఆర్. మాధవ్, పాలకమండలి సభ్యులు, డీన్లు వేదికపై ఆశీనులయ్యారు. చాన్స్‌లర్ హోదాలో ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం ఆద్యంతం విద్యార్థులు చప్పట్లతో హోరెత్తించారు. తన ప్రసంగం ప్రారంభంలో జేఎన్‌టీయూ విద్యార్థులు బంగారు బిడ్డలు అంటూ గవర్నర్ అనడం ఆకట్టుకుంది. గౌరవ డాక్టరేట్ డాక్టర్ చావా సత్యనారాయణకి ప్రదానం చేయడం ద్వారా జేఎన్‌టీయూ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని పీజీ, పీహెచ్‌డీ, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. మొత్తం 41 బంగారు పతకాలు ఇవ్వగా, 27 బంగారు పతకాలు అమ్మాయిలే సాధించడం గమనార్హం. ఆరు పతకాలు దక్కించుకున్న విద్యార్థి నంద్యాల పూజిత్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి.. బంగారు పతకాలు చాలా బరువుగా ఉన్నాయంటూ గవర్నర్ సరదాగా వ్యాఖ్యానించారు. జేఎన్‌టీయూ (ఏ) వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసగించారు. ‘ద టైమ్స్ ఇండియా వరల్డ్’ ర్యాంకింగ్‌లో వర్సిటీ 801–1000 ర్యాంకు దక్కించుకుందన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులో మైనర్ డిగ్రీని ప్రవేశపెట్టామని, అపార్ అనుసంధానంతో అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్‌ను ఏర్పాటు చేశామన్నారు. ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’లో వర్సిటీ భాగస్వామి కావడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎస్. కృష్ణయ్య, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.
‘విశ్వ’మంత సంబరం


