సెలవులకు వెళ్లి.. విగతజీవులుగా తిరిగొచ్చి!
● మల్లేపల్లె చెరువు మృతుల్లో ఇద్దరు పెద్ద బోధనం చిన్నారులు ● కుమారుల మృతితో శోకసంద్రంలో తల్లిదండ్రులు
చాగలమర్రి: వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరిలో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా తిరిగివచ్చారు. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మంఠం మండలం మల్లేపల్లె గ్రామంలో మంగళవారం చెరువులో పడి ఐదుగురు విద్యార్థులు మృత్యువాత పడిన విషయం విదితమే. ఐదుగురులో ఇద్దరు చాగలమర్రి మండలం పెద్దబోధనం గ్రామానికి చెందిన చిన్నారులు ఉండటంతో గ్రామంలో విషాదం నెలకొంది. పెద్దబోధనం గ్రామానికి చెందిన సుందరి పాపన్న, నారాయణమ్మ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు వెంకటసుబ్బయ్యకు బ్రహ్మాంగారి మఠం మండలం మల్లేపల్లికి చెందిన వెంకట భవానితో వివాహమైంది. వెంకట సుబ్బయ్య హోంగార్డుగా పని చేస్తూ హైదరాబాదులో నివాసముంటున్నాడు. వీరికి వెంకట చరణ్(15), వెంకట పార్థు(13) కుమారులు కాగా అక్కడే చదువుతున్నారు. ఎంతో అల్లారుముద్దగా చూసుకుంటున్న కుమారులను వెంకట సుబ్బయ్య వేసవి సెలవుల నేపథ్యంలో రెండు రోజుల క్రితం అమ్మమ్మ ఊరు మల్లేపల్లెలో వదిలేసి వెళ్లాడు. కాగా మంగళవారం సాయంత్రం ఇద్దరు చిన్నారులు మరో ముగ్గురుతో కలసి గ్రామ చెరువులో ఈతకొట్టేందుకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ చెరువులో మట్టి కోసం తవ్విన లోతైన గుంతల వైపు వెళ్లి ఐదుగురు నీట మునిగి మృత్యువాత పడ్డారు. ప్రొద్దుటూరు ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బుధవారం ఉదయం కుటుంబీకులకు అప్పగించారు. వెంకట చరణ్, వెంకట పార్థు మృతదేహాలను స్వగ్రామమైన పెద్దబోధనం గ్రామానికి తరలించారు. విగత జీవులుగా ఉన్న ఇద్దరు చిన్నారులను చూసి కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వేసవి సెలవులు తమ కుమారులకు శాశ్వత సెలవులుగా మారాయని తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
సెలవులకు వెళ్లి.. విగతజీవులుగా తిరిగొచ్చి!


