రసవత్తరంగా గార్ధభాల పోటీలు
కోవెలకుంట్ల: పట్టణంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం నిర్వహించిన గార్ధభాల పోటీలు రసవత్తరంగా సాగాయి. దేవాలయం నుంచి అంకాలమ్మ చౌరస్తా వరకు గార్ధభాలల పరుగు పందెం పోటీలను నిర్వహించారు. జిల్లాలోని ఆళ్లగడ్డ, చాగమర్రి, అవుకు, వెలుగోడు మండలాలకు చెందిన 13 గార్ధభాలు పోటీల్లో పాల్గొన్నాయి. పోటీలను ఆలయ ధర్మకర్త వెంకటసుబ్బారెడ్డి, మాజీ జెడ్పీటీసీ బీవీ ప్రసాదరెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు కానాల రవీంద్రనాథరెడ్డి ప్రారంభించారు. 220 కిలోల ఇసుక బస్తాలతో నిర్ణీత పది నిమిషాల వ్యవధిలో ఎక్కువ దూరం పరిగెత్తి విజేతగా నిలిచిన అవుకు మండలం మెట్టుపల్లెకు చెందిన నరసింహ గార్ధభం రూ. 15 వేలు కై వసం చేసుకుంది. ఆళ్లగడ్డ మండలం బాచిపల్లెకు చెందిన చిన్నరంగ గార్ధభం రెండవస్థానంలో నిలిచి రూ. 10 వేలు, చాగలమర్రి మండలం పెద్దవంగలి పాములేటి గార్ధభం మూడవస్థానంలో నిలిచి రూ. 7,500 గెలుపొందాయి. వెలుగోడు మండలం వేల్పనూరు సురేంద్ర గార్ధభం నాల్గవస్థానంలో నిలిచి రూ. 5వేలు, ఆళ్లగడ్డ మండలం బాచిపల్లె నాగేషు గార్ధభం ఐదవస్థానంలో నిలిచి రూ. 2,500 దక్కించుకున్నాయి. కార్యక్రమంలో నిర్వాహకులు కరిమద్దెల మురళీ, గడ్డం నాగేశ్వరరెడ్డి, గడ్డం రామకృష్ణారెడ్డి, సహదేవరెడ్డి, మనోహర్, రాజు, నాగేంద్ర, శిలువయ్య పాల్గొన్నారు.


