ఇంటర్ విద్యార్థినికి కమాండెంట్ అభినందన
కర్నూలు: రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతూ కూడా ఇంటర్ బైపీసీలో 420 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థి సృజనామృతను ఏపీఎస్పీ కర్నూలు బెటాలియన్ కమాండెంట్ దీపిక పాటిల్ అభినందించారు. రెండో పటాలంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఉరుకుంద, జానకి దంపతుల కూతురు సృజనామృత ఇంటర్ (బైపీసీ) ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరచినందుకు కమాండెంట్ దీపిక పాటిల్ అభినందన సభ ఏర్పాటు చేశారు. బెటాలియన్ జ్ఞాపికతో సృజనామృతను ఘనంగా సత్కరించారు. క్యాన్సర్ జబ్బుతో బాధ పడుతూ కూడా ఇంతటి విజయాన్ని సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచిందని కమాండెంట్ ప్రశంసించారు. జీవితంలో ఇలాంటి విజయాలు మరిన్ని సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కమాండెంట్ ఆకాంక్షించారు. అడిషనల్ కమాండెంట్ నాగేంద్రరావు, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు, సృజనామృత తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
హౌసింగ్ పీడీగా చిరంజీవి
కర్నూలు(అర్బన్): జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌గా డిప్యూటీ కలెక్టర్ టి.చిరంజీవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం జీఓ 713 జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే చిరంజీవికి ఇక్కడకు పోస్టింగ్ ఇచ్చారు. గతంలో ఈయనకు హౌసింగ్ పీడీగా ఇక్కడే పనిచేసిన అనుభవం ఉంది.
ఇంటర్ విద్యార్థినికి కమాండెంట్ అభినందన


