కొత్తపల్లి: పైరు కాపలా కోసమని పొలానికెళ్లిన రైతు అక్కడే ప్రాణాలొదిలన ఘటన ఆదివారం రాత్రి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన రైతు చాకలి మధు(38) ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని 3 ఎకరాల్లో వేరుశనగ, 3 ఎకరాల్లో మినుము సాగు చేశాడు. సమీపంలో నల్లమల అటవీ ప్రాంతం ఉండటంతో అడవి పందుల బెడద నుంచి వేరుశనగ పైరును కాపాడుకునేందుకని రాత్రి కాపలా కోసమని పొలానికి వెళ్లి అక్కడే నిద్రించాడు. సోమవారం ఉదయం అతని స్నేహితుడు పాతకోట వెంకటరమణ డీజిల్ కోసమని మధు పొలం వద్దకు వెళ్లి చూడగా విగత జీవిగా పడి ఉండటంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఎం.కేశవ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. విషపురుగు కాటుతో మృతిచెంది ఉండొచ్చని పలువురు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.