కోడుమూరు టిక్కెట్‌ ఎంతకు అమ్ముకున్నారు?

- - Sakshi

సమావేశంలో జోనల్‌ కోఆర్డినేటర్‌ను నిలదీసిన కోట్ల వర్గం

 బొగ్గుల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన నియోజకవర్గ ముఖ్య నాయకులు

 మార్చకపోతే ఓడిస్తామంటూ తేల్చి చెప్పిన కార్యకర్తలు

కర్నూలు: కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై వ్యతిరేకం భగ్గుమంటోంది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వర్గంగా ముద్ర పడిన వారంతా టీడీపీ జోనల్‌–5 కోఆర్డినేటర్‌ బీద రవిచంద్రపై తిరుగుబాటు చేశారు. బొగ్గుల దస్తగిరి అభ్యర్థిత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కోట్ల వర్గం రెండు రోజుల క్రితం నగరంలోని భూపాల్‌ కాంప్లెక్స్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న ఆకెపోగు ప్రభాకర్‌ను రెబల్‌ అభ్యర్థిగా బరిలో నిలపాలని తీర్మానించారు. విషయం తెలుసుకున్న ముగ్గురు జిల్లా ఇన్‌చార్జి నాయకులు రాజీ కుదిర్చేందుకు కర్నూలుకు చేరుకున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కోడుమూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల ముఖ్య నేతలతో మంగళవారం సాయంత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

అయితే కోడుమూరు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఎంతకు అమ్ముకున్నారు... ఒక్కనాడు కూడా పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనలేదు. అధిష్టానం ఏకపక్ష నిర్ణయంతో బొగ్గుల దస్తగిరిని ప్రకటించారంటూ జోనల్‌ కోఆర్డినేటర్‌ బీద రవిచంద్రపై తిరుగుబాటు చేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఎవరు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాక సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశంలో ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి, కర్నూలు పార్లమెంటు అధ్యక్షులు బీటీ నాయుడు, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాల పరిశీలకులు డాక్టర్‌ శ్రీనివాసులు కూడా పాల్గొన్నారు. దస్తగిరి అభ్యర్థిత్వాన్ని పునఃపరిశీలించాలని, లేకుంటే ఆకెపోగు ప్రభాకర్‌ను రెబల్‌ అభ్యర్థిగా బరిలోకి దింపి తమ తడాఖా ఏంటో చూపిస్తామంటూ కోట్ల వర్గీయులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని బీద రవిచంద్ర నాయకులకు హామీ ఇచ్చి సమావేశాన్ని ముగించారు.

Election 2024

Read latest Kurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top