తప్పును సమర్థించుకునే ‘డ్రామా’.. రామోజీ షో అట్టర్‌ ఫ్లాప్‌! | - | Sakshi
Sakshi News home page

తప్పును సమర్థించుకునే ‘డ్రామా’.. రామోజీ షో అట్టర్‌ ఫ్లాప్‌!

Jan 2 2024 2:04 AM | Updated on Jan 2 2024 2:14 PM

- - Sakshi

కర్నూలు: ఆకలైన వారికి అన్నం పెడితే ఎవరైనా వద్దంటారా? కడుపు నిండా భోజనం చేసిన వారిని తిను తిను అంటే ఎలా తింటారు. కర్నూలు డాక్టర్స్‌ కాలనీలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో గత మూడు రోజులుగా ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంటోంది. ఒకసారి చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలే తప్ప, తిరిగి పదే పదే అదే తప్పును చేయబోయి ‘ఈనాడు’ చేతులు కాల్చుకుంటోంది. వండి వార్చిన తప్పుడు కథనాలను సమర్థించుకునేందుకు రామోజీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.

గత నెల 30న ‘మనసు లేని మామయ్య’ శీర్షికన ఈనాడు మొదటి పేజీలో కర్నూలు డాక్టర్స్‌ కాలనీలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయకపోవడం వల్ల చలికి గజగజ వణికిపోతున్నట్లు తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే 31వ తేదీన వాస్తవాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం ‘సాక్షి’ చేసింది. గత డిసెంబర్‌ 5న ప్రభుత్వం గిరిజన ఆశ్రమ పాఠశాలలకు దుప్పట్లను సరఫరా చేయగా, ఈ పాఠశాలలో 6వ తేదిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ( మొత్తం 90 మంది విద్యార్థులు ) దుప్పట్లను పంపిణీ చేశారని, ఆధారాలతో ‘సాక్షి’లో ‘సిగ్గు సిగ్గు నవ్విపోతారు ... కర్నూలు గిరిజన ఆశ్రమ పాఠశాలలో రామోజీ షో ’ శీర్షికన కథనం ప్రచురితమైంది.

మరో డ్రామాకు తెరలేపిన ఈనాడు
తమ తప్పుడు రాతలను కప్పిపుచ్చుకునేందుకు మరో డ్రామాకు ‘ఈనాడు’ తెరలేపింది. యుగ తులసి ఫౌండేషన్‌ ద్వారా అదే పాఠశాలలోని విద్యార్థులకు దుప్పట్లను అందించేందుకు డిసెంబర్‌ 31న ప్రయత్నించింది. అయితే తమకు ప్రభుత్వం అందించిన దుప్పట్లు ఉన్నాయని, దాతలు తీసుకొచ్చిన దుప్పట్లను తీసుకునేందుకు విద్యార్థులు తిరస్కరించారు. అనేక రూపాల్లో కాళ్లావేళ్లాపడినా విద్యార్థులు ససేమిరా అన్నారు. జిల్లా కలెక్టర్‌ ద్వారా చేసిన ప్రయత్నం కూడా ఫలించకపోవడంతో తిరిగి తమదైన శైలిలో ‘జగన్‌ మామ.. ఇదేమి పైత్యం’ అంటూ మరో తప్పుడు కథనాన్ని ప్రచురించారు. ఒక్క దుప్పటైనా ఇవ్వండని విద్యార్థులు వేడుకున్నట్లు రాసుకోవడం ఆ పత్రిక పైశాచికత్వానికి నిదర్శనం. రెండు గంటలు వేచి చూసినా, విద్యార్థులు ఎవరు దుప్పట్లు తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో తమ పంతం నెగ్గించుకునేందుకు సమీపంలోని బీసీ కళాశాల బాలికల వసతి గృహంలోని విద్యార్థినీలకు దుప్పట్లను పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు.

వేడుకోవడం అవాస్తవం
దుప్పట్ల కోసం యుగ తులసి ఫౌండేషన్‌ ప్రతినిధులను విద్యార్థులు వేడుకోవడం అవాస్తవం. విద్యార్థులకు అవసరమైన దుప్పట్లను ఇప్పటికే పంపిణీ చేశాం. గత ఏడాది నవంబర్‌ 30న జిల్లాలోని మూడు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు 725 దుప్పట్లను ప్రభుత్వం సరఫరా చేసింది. వీటిని డిసెంబర్‌ 4, 5 తేదీల్లో ఆయా పాఠశాలలకు పంపించాం.

– ఎస్‌.శ్రీనివాసకుమార్‌, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి, కర్నూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement