తాగునీరు సురక్షితమేనా ? | - | Sakshi
Sakshi News home page

తాగునీరు సురక్షితమేనా ?

Sep 21 2026 6:59 AM | Updated on Sep 21 2026 6:59 AM

తాగునీరు సురక్షితమేనా ?

రంగుమారి వస్తున్న మున్సిపల్‌ వాటర్‌ ఆర్వో వాటర్‌ ప్లాంట్లలో ఫంగస్‌ ఉంటున్న వైనం వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు ఉమ్మడి జిల్లాలో తరచూ విజృంభిస్తున్న డయేరియా టైఫాయిడ్‌, జాండీస్‌కు దారితీస్తున్న వైనం

ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు..

లబ్బీపేట(విజయవాడతూర్పు): మనం తాగుతున్న నీరు సురక్షితమైనా.. ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా ప్రజల్లో ఇదే చర్చ జరుగుతుంది. నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటితో పాటు ఉమ్మడి జిల్లాల్లోని మున్సిపాలిటీలు, పంచాయతీల్లోనూ నీరు రంగు మారి వస్తుండగా, ఆర్వో ప్లాంట్లలో కొనుగోలు చేస్తున్న నీటిలో సైతం ఫంగస్‌ ఉంటున్నట్లు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో తేలింది. ఇలా ఏ నీరు తాగినా వ్యాధులు సోకడం తథ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల విజయవాడలో గిరిపురంతో పాటు కృష్ణాజిల్లాలోని ఉయ్యూరు, కంకిపాడులో పెద్ద సంఖ్యలో ప్రజలు డయేరియా బారిన పడ్డారు. అంతేకాక గతేడాది సెప్టెంబర్‌లో న్యూ రాజరాజేశ్వరిపేటలో దాదాపు 300ల మందికి పైగా డయేరియా బారిన పడటానికి కలుషిత నీరే కారణంగా తేలింది. దీంతో నగరంతో పాటు, జిల్లా ప్రజల్లో ఎంత మంది శుద్ధ జలాలు తాగుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలు తాగునీటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

కుళాయిల్లో రంగుమారిన నీరు సరఫరా..

నగరపాలకసంస్థ సరఫరా చేసే నీరు తరచూ పలు ప్రాంతాల్లో రంగు మారి వస్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు. వాస్తవంగా కృష్ణానది నుంచి నీటిని శుద్ధి చేసి పైప్‌లైన్‌ ద్వారా సరఫరా చేస్తుంటారు. అయితే మధ్యలో పైప్‌లైన్‌లు పగిలి నీరు కలుషితం అవుతుంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో దశాబ్ధాల కిందట వేసిన పైప్‌లైన్‌లో ఉన్నాయి. డ్రెయినేజీల్లో మంచినీటి పైప్‌లైన్‌లు వెళ్లిన ప్రాంతాలు ఉన్నాయి. ఇలా రెండేళ్లలో మొగల్రాజపురంతో పాటు న్యూ రాజరాజేశ్వరిపేట, గిరిపురం ప్రాంతాల్లో డయేరియా సోకిన సమయంలో ఇదే విషయాన్ని అధికారులు గుర్తించారు. చాలా బ్లాక్‌లలో పగిలిన డ్రెయినేజీ పైపుల పక్కనే మంచినీటి పైప్‌లైన్‌లు ఉంటున్నాయి. డయేరియా లాంటి వ్యాధులు సోకితేనే అధికారులు దృష్టి పెడుతున్నారు.

అపరిశుభ్రంగా ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లు..

నగరంతో పాటు ఉమ్మడి జిల్లాల్లోని పలు ఓవర్‌హెడ్‌ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. వాటిని తరచూ శుభ్రం చేయాల్సి ఉన్నా, ఏదో నామమాత్రంగా చేస్తున్నారే కానీ, పూర్తిగా చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో అపరిశుభ్రంగా ఉన్న ఓవర్‌హెడ్‌ ట్యాంకుల్లో నీరు తాగిన వారు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందంటున్నారు. అందుకు ఇటీవల నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం డయేరియా కేసులు నమోదు కావడమే నిదర్శనంగా చెబుతున్నారు.

ఆర్వో వాటర్‌లో ఫంగస్‌..

నగరంలోని ఆర్వో వాటర్‌ ప్లాంట్‌లు కుప్పలు తెప్పలుగా వెలిశాయి. ఏ ప్రాంతంలో చూసిన నిబంధనలకు విరుద్ధంగా ఆర్వో ప్లాంట్‌లు ఏర్పాటు చేశారు. వాటిలో చాలా వరకూ అనుమతులు కూడా లేనివి ఉన్నాయి. అలాంటి ప్లాంట్‌ల నుంచి వచ్చే నీరు తాగితే వ్యాధులు సోకడం తథ్యమంటున్నారు. కొన్ని ఆర్వో ప్లాంట్లలో పట్టిన నీటిని తనిఖీ చేస్తే ఫంగస్‌ ఉన్నట్లు గుర్తించారు.

ఆ ఫంగస్‌ కారణంగా టైఫాయిడ్‌, జాండీస్‌ వంటి వ్యాధులు సోకే అవకాశం ఉందంటున్నారు. అంతేకాకండా ఆర్వో ప్లాంట్‌లు భూగర్భ జలాలను వినియోగిస్తుండటంతో అవసరమైన మినరల్స్‌ వాటిలో ఉండవని, అవి తాగితే ఎముకలు గుల్లబారే ప్రమాదముంది.

ఆర్వో వాటర్‌ అనారోగ్యకరం..

ఇబ్బడి ముబ్బడిగా ఆర్వో ప్లాంట్‌లు నిబంధనలకు విరుద్ధగా వెలుస్తున్నాయి. అవి నీటిలోని గాఢతను తగ్గించి, తాగడానికి అనుకూలమైన నీ టిని అందిస్తున్నాయే కానీ, వాటిలో ఎలాంటి మి నరల్స్‌ ఉండటం లేదు. తాగునీటిలో అవసరమై న కాల్షియం, మెగ్నీషియం ఐరన్‌ ఉండాల్సిన అ వసరం ఉంది. అంతేకాకుండా నైట్రేట్‌ శాతాన్ని తగ్గించాలి. కానీ అదేమి జరగడం లేదు. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. నగరపాలకసంస్థ సరఫరా చేసే నీరు కూడా కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. దీంతో కలుషిత నీరు తాగి ప్రజలు డయేరియా బారిన పడుతున్నారు. గతేడాది న్యూ రాజరాజేశ్వరిపేటలో 300ల మంది డయేరియా బారిన పడగా, ఈ ఏడాది విజయవాడలోని గిరిపురం, కృష్ణాజిల్లాలోని ఉయ్యూరు, కంకిపాడుల్లో డయేరియా కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. ఈ విషయంలో ప్రభుత్వం సిగ్గుపడాలి. డయేరియా రాకుండా చూడాల్సిన పాలకులు చోద్యం చూస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పటికై నా శుద్ధి చేసిన తాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

– డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్‌ సీపీ వైద్య విభాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement