నిండుకుంటున్న రక్త నిల్వలు! | - | Sakshi
Sakshi News home page

నిండుకుంటున్న రక్త నిల్వలు!

Aug 29 2026 1:58 AM | Updated on Aug 29 2026 1:58 AM

నిండుకుంటున్న రక్త నిల్వలు! ఉరుకులు పరుగులు పెడుతున్న రోగుల బంధువులు

కృష్ణా జిల్లాలో 423 యూనిట్లే రక్త నిల్వ రక్తం కోసం కుటుంబాలపై ‘రిప్లేస్‌మెంట్‌’ భారం అనధికార రక్తసేకరణపై పర్యవేక్షణ కరువు

ఉరుకులు పరుగులు పెడుతున్న రోగుల బంధువులు

మచిలీపట్నంఅర్బన్‌: జిల్లాలో రక్తం నిల్వలు నిండుకుంటున్నాయి. అవసరం మేర రక్తం అందుబాటులో లేదు. దీంతో అత్యవసర సమయంలో రక్తం కోసం వచ్చే రోగుల కుటుంబాలకు పరుగులు తప్పడం లేదు. రక్తసేకరణ, నిల్వలు, పంపిణీ వ్యవస్థలో సమన్వయం కొరవడటంతో.. కొన్ని సందర్భాల్లో అవసరమైన రక్తం అందుబాటులో ఉన్నా దాన్ని పొందేందుకు కుటుంబ సభ్యులే రక్తదానం చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అరుదైన రక్త గ్రూపుల విషయంలో ఒక యూనిట్‌ రక్తం కోసం రెండు యూనిట్లు ఇవ్వాలనే షరతులు ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్లడ్‌ బ్యాంకు నిర్వాహకులు విధిస్తున్నారు. ప్రైవేటు రక్తనిల్వ కేంద్రాల్లోనూ ఒక్కో యూనిట్‌కు రూ.3వేల వరకు, అరుదైన గ్రూపులకు రూ.4వేల వరకు వసూలు చేస్తున్నారు. మరోవైపు కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్‌ కేంద్రాల్లో అనధికారికంగా రక్తసేకరణ జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

శిబిరాలు పెరిగినా..

రక్తదాన శిబిరాల్లో జరిగే రక్తసేకరణ ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. 2024–25లో 70 శిబిరాల ద్వారా 1,800 యూనిట్లు సేకరించగా.. 2025–26లో శిబిరాల సంఖ్య 100కు పెరిగినా సేకరణ 2,308 యూనిట్లకే పరిమితమైంది. అంటే 30 శిబిరాలు అదనంగా నిర్వహించినప్పటికీ.. ఒక్కో శిబిరం సగటు సేకరణ 25.7 యూనిట్ల నుంచి 23.1 యూనిట్లకు తగ్గింది. 2026–27లో ఆగస్టు వరకు ఐదు నెలల్లో 28 శిబిరాల ద్వారా 528 యూనిట్లు మాత్రమే సేకరించారు. ఒక్కో శిబిరానికి సగటు సేకరణ 18.9 యూనిట్లకు పడిపోయింది.

423 యూనిట్లే నిల్వ..

ఆగస్టు 28 నాటికి జిల్లాలోని రక్తనిల్వ కేంద్రాలు, బ్లడ్‌ స్టోరేజ్‌ యూనిట్లలో 179 హోల్‌ బ్లడ్‌ యూనిట్లు, 244 ప్యాక్డ్‌ రెడ్‌ బ్లడ్‌ సెల్స్‌ యూనిట్లు కలిపి మొత్తం 423 యూనిట్లు మాత్రమే నిల్వగా ఉన్నాయి. జిల్లాలో రెండు ప్రభుత్వ, ఎనిమిది ప్రైవేటు రక్తనిల్వ కేంద్రాలు ఉన్నప్పటికీ.. అత్యవసర అవసరాలకు ఈ నిల్వలు ఏ మేరకు సరిపోతాయన్నది రక్త గ్రూపుల వారీగా సమీక్షించాల్సిన అంశంగా మారింది. ముఖ్యంగా ప్రమాదాలు, ప్రసవాలు, శస్త్రచికిత్సలు, తలసేమియా వంటి సందర్భాల్లో రక్తం అత్యవసరంగా అవసరమవుతోంది.

35 రోజులే షెల్ఫ్‌ లైఫ్‌..

రక్తానికి సుమారు 35 రోజుల షెల్ఫ్‌ లైఫ్‌ మాత్రమే ఉండటంతో.. రక్తసేకరణ, నిల్వ, వినియోగం మధ్య సమన్వయం అత్యంత కీలకం. అవసరానికి మించి సేకరించిన రక్తాన్ని సకాలంలో వినియోగించకపోతే గడువు ముగిసే అవకాశం ఉండగా.. అవసరమైన గ్రూపుల రక్తం అందుబాటులో లేకపోతే అత్యవసర సమయంలో రోగులకు ఇబ్బందులు తప్పవు.

లైసెన్స్‌ల కోసం..

జిల్లాలోని కొన్ని రక్తనిల్వ కేంద్రాల లైసెన్సుల విషయంలోనూ స్పష్టత అవసరమవుతోంది. బందరులోని కొన్ని బ్లడ్‌ బ్యాంకుల లైసెన్స్‌లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. అవనిగడ్డ, చల్లపల్లి సీహెచ్‌సీల బ్లడ్‌ స్టోరేజ్‌ యూనిట్లు లైసెన్స్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా కేంద్రాల ప్రస్తుత లైసెన్స్‌ స్థితి, రక్తసేకరణ, నిల్వలకు సంబంధించిన అనుమతులపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

అందుబాటులో ఉండేలా చూస్తే మేలు..

ఒకవైపు రక్తదానం కోసం అవగాహన కార్యక్రమాలు, శిబిరాలు.. మరోవైపు అత్యవసర సమయంలో ‘రీప్లేస్‌మెంట్‌’ కోసం కుటుంబాలపై ఒత్తిడి, రక్తం కోసం వసూళ్ల ఆరోపణలు, అనధికార రక్తసేకరణపై విమర్శ లు.. ఇవన్నీ కలిపి చూస్తే జిల్లాలో రక్తసేకరణ నుంచి రక్తం అవసరమైన రోగికి చేరే వరకు వ్యవస్థను సమగ్రంగా సమీక్షించాల్సిన అవసరం స్పష్టమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement