దుర్గమ్మకు రూ.4.77లక్షల విలువైన వెండి గిన్నెలు | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు రూ.4.77లక్షల విలువైన వెండి గిన్నెలు

Aug 29 2026 1:58 AM | Updated on Aug 29 2026 1:58 AM

దుర్గమ్మకు రూ.4.77లక్షల విలువైన వెండి గిన్నెలు రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలు ప్రారంభం దుర్గమ్మ సేవలో మారిషస్‌ మంత్రి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించండి

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు రూ.4.77లక్షల విలువైన 1.835కిలోల వెండి గిన్నెలను శుక్రవారం కానుకగా సమర్పించారు. విజయవాడ పటమటకు చెందిన యలమంచలి రవేంద్రరావు దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. 1.835కిలోల వెండితో తయారు చేయించిన గంగాళాలను ఆలయ చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్‌ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

మైలవరం: కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ రాధికా చారిటబుల్‌ ట్రస్ట్‌, మైలవరం లకిరెడ్డి బాలిరెడ్డి విద్యా సంస్థలు, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ మైలవరం వారి సహకారంతో స్థానిక లకిరెడ్డి హనిమిరెడ్డి క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్‌ మాట్లాడుతూ ఫుట్‌బాల్‌ అనే క్రీడా ప్రపంచంలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉందన్నారు. మన దేశంలో ఫుట్‌బాల్‌లో వెనుకబడి ఉన్నామని, గ్రామ స్థాయి క్రీడాకారులకు ఫుట్‌బాల్‌లో మంచి అవకాశం ఉందన్నారు. మైలవరంలో జరుగుతున్న పోటీలలో 25 జిల్లాల నుంచి 25 టీమ్‌లు పాల్గొంటున్నాయని తెలిపారు. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల అసోసియేషన్‌ అధ్యక్షుడు శేషగిరిరావు, అనిల్‌కుమార్‌, జిల్లా చైర్మన్‌ రవీంద్ర రాణా, రాధిక చారిటబుల్‌ ట్రస్టు అధ్యక్షురాలు రాధిక, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ మైలవరం పీఎస్టీలు, ప్రోగ్రామ్‌ కన్వీనర్‌ జాస్తి వెంకటేశ్వరరావు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను మారిషస్‌ దేశ పబ్లిక్‌ సర్వీస్‌, అడ్మినిస్ట్రేషన్‌ రిఫార్మ్స్‌ మంత్రి లచ్మన పెంటియా శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మారిషస్‌ మంత్రిని ఆలయ ఆధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ చైర్మన్‌ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్‌ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

మచిలీపట్నంటౌన్‌: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలని కృష్ణా జిల్లా ప్రజా రవాణా అధికారి కొడమంచిలి వెంకటేశ్వర్లు సూచించారు. స్థానిక బస్టాండ్‌ కార్యాలయంలోని పైఅంతస్తులో ఉన్న జిల్లా ప్రజా రవాణాధికారి కార్యాలయంలోని ఆయన చాంబర్‌లో జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల మేనేజర్లు, ట్రాఫిక్‌ సూపర్‌వైజర్లు, మెకానికల్‌ సూపర్‌వైజర్లతో వెంకటేశ్వర్లు జిల్లా స్థాయి సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. స్వర్ణాంధ్రా – స్వచ్ఛాంధ్రా కార్యక్రమంలో భాగంగా బస్‌ స్టేషన్‌లు, టాయిలెట్ల పరిశుభ్రత, ప్రయాణికులకు మౌలిక సదుపాయాల కల్పించడం, పరిశుభ్రమైన తాగునీటి సదుపాయాల మీద ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ నెల 31లోపు వెబ్‌ సైట్‌లో సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ పూర్తి చేయాలని, సెప్టెంబర్‌ 1 నుంచి 8 వరకు సంబంధిత కమిటీల పర్యవేక్షణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సీ్త్ర శక్తి పథకం అమలుతో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, ఆయా రూట్లలో బస్‌ స్టాప్‌ల వద్ద బస్సులు తప్పనిసరిగా ఆగేలా చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వర్లు సిబ్బందికి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement