పథకాన్ని నీరుగార్చే కుట్ర
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): చంద్రబాబు ప్రభుత్వం కొత్త నిబంధనలతో తల్లికి వందనం పథకానికి ఎసరు పెట్టేందుకు కసరత్తు చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పటి వరకూ లేని కొత్త నిబంధనలను తీసుకొచ్చిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. బాలలు కార్మికులుగా మారకూడదనే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ‘అమ్మ ఒడి’ పథకాన్ని తీసుకొచ్చింది. తమ పిల్లలను బడికి పంపించే తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ఏటా రూ.15 వేల చొప్పున జమచేసి. బాలలు అందరినీ బడిబాట పట్టిం చింది. ఆ పథకానికి జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంకన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు అమలుచేస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం పథకం పేరును తల్లికి వంద నంగా మార్చి అర్హుల సంఖ్యను భారీగా తగ్గిం చింది. తాజాగా ఎస్సీ విద్యార్థులకు కొత్త నిబంధనలను తీసుకొచ్చి తల్లికి వందనం పథకాన్ని వారికి దూరం చేస్తోందని పలువురు తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
కొత్త ఖాతా తెరవాల్సిందే..
పదో తరగతి పూర్తి చేసుకొని ఇంటర్మీడియెట్‌లో చేరిన ఎస్సీ విద్యార్థులు అందరనూ కొత్తగా బ్యాంక్ ఖాతా తెరవాలని సాంఘీక సంక్షేమ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఖాతా తెరిచిన వారికి మాత్రమే తల్లికి వందనం పథకం వర్తిస్తుందనే స్పష్టంచేశారు. విద్యార్థి కేవలం ఆధార్‌కార్డు, దానికి లింకై న ఫోన్ నంబర్‌తో బ్యాంక్ ఖాతాను తెరవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీ లోపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ శాఖల్లో మాత్రమే ఖాతా తెరిచి ఆ సమాచారాన్ని అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు.
పాన్‌కార్డు కావాల్సిందే..
కొత్తగా ఖాతాను తెరిచేందుకు వెళ్తున్న విద్యార్థులను బ్యాంకర్లు పాన్ కార్డ్ కావాలని అడుగుతున్నారు. పాన్ కార్డు లేకుండా కొత్తగా ఖాతాను తెరవటానికి అవకాశం లేదని కొన్ని బ్యాంకు శాఖల్లో అధికారులు చెబుతున్నారు. ఎంపిక చేసిన కొన్ని జాతీయ బ్యాంకుల్లో మాత్రమే ఖాతా తెరవాలని సూచించటం, అందులోనూ మూడు నాలుగు రోజుల్లోనే ఈ తంతు పూర్తి చేసి ఆప్‌డేట్ చేయాలని ప్రకటించటంపై తల్లిదండ్రులు, విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. చాలా మందికి ఈ సమాచారం తెలియలేదని విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు.
ఆధార్ లింకే సమస్య
ఆధార్‌కార్డుకు ఫోన్ నంబర్ లింక్ కాకపోవటంతో బ్యాంకులు ఖాతా తెరిచేందుకు అభ్యంతరం చెబుతున్నాయి. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు తల్లిదండ్రులు సెల్‌ఫోన్లు కొనిచ్చే పరిస్థితి లేదు. కొత్త నిబంధనల నేపథ్యంలో ఫోన్ కొని సిమ్ కార్డు తీసుకుని, దానిని విద్యార్థి ఆధార్ కార్డుకు లింక్ చేయటం ఇప్పటికిప్పుడు పూర్తయ్యే పరిస్థితి లేదు. కొత్తగా ఫోన్ నంబర్ లింక్ చేయాలంటే ఇబ్బందులు తప్పవని, అక్షరాస్యత లేని కుటుంబాలకు ఇంకా కష్టమని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. అమ్మ ఒడి పేరుతో గత ప్రభుత్వం సమర్థంగా అమలు చేసిన ఈ పథకాన్ని తల్లికి వందనం పేరు మార్చి నీరుగార్చారని విమర్శిస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి అని చెప్పిన కూటమి ప్రభుత్వం సుమారు ఉమ్మడి కృష్ణాజిల్లాలో 50 వేల మంది పిల్లలకు ఈ పథకం ఇవ్వలేదంటూ ఆరోపిస్తున్నారు. తాజాగా ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థులు ఖాతా తెరవాలనే పేరుతో పథకంలో కోత పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు.
ఇంటర్‌లో చేరిన ఎస్సీ విద్యార్థులు బ్యాంక్ ఖాతా తెరవాలని ఆదేశం
పాన్‌కార్డు లేకుండా ఖాతాను తెరవబోమంటున్న బ్యాంక్ సిబ్బంది
ఆధార్‌కు ఫోన్ నంబర్ లింక్ కాకపోవటంతో బ్యాంకర్ల అభ్యంతరం
పథకం ఎగవేతకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందంటున్న విద్యార్థి సంఘాలు
తల్లికి వందనం పథకాన్ని నీరుగార్చేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. తల్లికి వందనం పేరుతో తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. అటువంటిది ఇప్పుడు ఎస్సీ విద్యార్థులు కొత్తగా ఖాతాలు తెరవాలని చెప్పటం ఏమిటి? అందులోనూ వారికి పాన్‌కార్డులు ఉండవు. ఆధార్‌కార్డుకు ఫోన్ లింక్ అయ్యే అవకాశాలు తక్కువ. అసలు వారికి ఫోనే ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పథకాన్ని పూర్తిగా కోతలు పెట్టేందుకు చంద్రబాబు సర్కార్ ఆడుతున్న నాటకంగా కనిపిస్తోంది. ఎటువంటి ఆంక్షలు, కొత్త నిబంధనలు లేకుండా పథకాన్ని అమలు చేయాలి.
– ఎ.రవిచంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం


