రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Jun 10 2026 1:19 AM | Updated on Jun 10 2026 1:19 AM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి టిప్పర్‌ ఢీకొని ఒకరి దుర్మరణం విద్యుదాఘాతంతో యువకుడి మృతి

మక్కపేట(వత్సవాయి): రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన వత్సవాయి మండలంలోని మక్కపేట గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఖమ్మం జిల్లా, బోనకల్లు మండలం, పెద్దబీరవల్లి గ్రామానికి చెందిన గొర్రెముచ్చు ప్రమీళ (41) మక్కపేట సెంటర్‌లో ఆటో దిగింది. అనంతరం బైక్‌ ఎక్కి జగ్గయ్యపేట వైపు వెళ్తుండగా పంచాయతీ కార్యాలయం సమీపంలో అదుపుతప్పి రోడ్డు మీద పడిపోయింది. అదే సమయంలో పెనుగంచిప్రోలు వైపు నుంచి వస్తున్న టిప్పర్‌ టైరు ఆమె తలపై ఎక్కటంతో తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోనే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే బైక్‌ నడుపుతున్న వ్యక్తి పరారయ్యాడు. ఎస్‌ఐ పి.ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారయిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పామర్రు: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై బల్లిపర్రు అడ్డరోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పామర్రు మండలంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మచిటీ పట్నం మండలం బొర్రపోతుపాలెంనకు చెందిన కత్తిక శ్రీనివాసరావు(50) అదే గ్రామానికి చెందిన ముక్కు రామకృష్ణతో కలిసి బైక్‌పై విజయవాడకు ప్రయాణమయ్యారు. పామర్రు మండలం బల్లిపర్రు అడ్డరోడ్డు వద్ద వెనుక నుంచి టిప్పర్‌ అతి వేగంగా వచ్చి బైక్‌ను బలంగా ఢీకొట్టి కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో శ్రీనివాసరావు తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రామకృష్ణ కాలికు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతిని పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. పామర్రు సీఐ నాగప్రసాద్‌, ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. టిప్పర్‌ డ్రెయివర్‌ నిద్ర మత్తులో ఉండటం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. టిప్పర్‌ డ్రెయివర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ కె.శ్రీనివాస్‌ తెలిపారు.

నందివాడ: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని తమిరిశ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తమిరిశ గ్రామానికి చెందిన అలవాల నాగరాజు (36), వెంకటలక్ష్మి దంపతులు. నాగరాజు దినసరి కూలీగా జీవిస్తున్నాడు. మంగళవారం ఇంట్లో విద్యుత్‌ సరఫరా జరగడంలేదని తీగలను సరిచేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. స్పృహలేకుండా పడవున్న నాగరాజును అతని భార్య వెంకటలక్ష్మి గమనించి బంధువుల సాంయంతో 108 అంబులెన్స్‌లో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే నాగరాజు మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement