అహంకారాన్ని చూపిస్తారా? | - | Sakshi
Sakshi News home page

అహంకారాన్ని చూపిస్తారా?

Jun 10 2026 1:19 AM | Updated on Jun 10 2026 1:19 AM

అహంకారాన్ని చూపిస్తారా?

బాధితుల్ని ఓదార్చాల్సిందిపోయి..

చిలకలపూడి(మచిలీపట్నం): విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాద బాధిత కుటుంబాలను ఓదార్చాల్సింది పోయి.. రాష్ట్ర మంత్రులు అహంకారంతో వ్యవహరించడం, సంస్కారం లేని మాటలు మాట్లాడటం దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాల్సిన సమయంలో అహంకారాన్ని చూపిస్తారా? అని మండిపడ్డారు. మంగళవారం మచిలీపట్నంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన సెక్షన్లలో 22 మంది కార్మికులు ఉండాల్సి ఉండగా.. పది మందితో పని చేయించడం వల్ల ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఏడాదికి 3.2 మిలియన్‌ టన్నుల ఉత్పాదక సామర్థ్యం ఉన్నప్పుడు 18 వేల మంది కార్మికులు పనిచేయగా.. నేడు 7.2 మిలియన్‌ టన్నుల ఉత్పాదక సామర్థ్యమున్నా కేవలం 8 వేల మంది కార్మికులు పనిచేయిస్తున్నారని వివరించారు. అనుభవం ఉన్న కార్మికులను గత రెండేళ్లలో వీఆర్‌ఎస్‌ పేరుతో ఇంటికి పంపించేశారని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి భరోసా ఇవ్వాల్సిందిపోయి.. ‘మీ ఇంట్లో వాళ్లు చనిపోయారా?’ అంటూ మంత్రి నారా లోకేశ్‌ అహంకారంగా మాట్లాడటం ఏమిటని పేర్ని నాని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క రూపాయి పరిహారం ప్రకటించలేదని విమర్శించారు. 2011లో ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులకు ప్రకటించిన రూ.25 లక్షల పరిహారాన్నే.. ఇప్పుడు యాజమాన్యం ద్వారా ఇస్తామనడం చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ప్రమాదం జరిగిన గంట ల్లోనే కేంద్ర మంత్రి ఘటనా స్థలానికి రాగా.. ఒక రోజు తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌, అన్ని శాఖల మంత్రి నారా లోకేశ్‌ రావడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య తీరుకు నిదర్శనమన్నారు. ‘గతంలో కార్మిక సంఘాల సమావేశంలో తాను మాట్లాడినప్పుడు.. చెయ్యి ఎత్తకపోవడం వల్లే స్టీల్‌ ప్లాంట్‌కు క్యాప్టివ్‌ మైన్‌ ఇప్పించలేదు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చేస్తే మేమే ఆపాం’ అని డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ మాట్లాడారంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కుమారస్వామి మాట్లాడిన వీడియోను పేర్ని నాని ప్రదర్శించారు. ‘స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి మాకు పంపించింది. అందువల్లే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని 2025 జనవరిలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి చెప్పిన వీడియోను చూపించి పవన్‌కల్యాణ్‌ను పేర్ని నాని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజైనా ప్లాంట్‌ను సందర్శించావా? అని పవన్‌ను నిలదీశారు. నాడైనా, నేడైనా స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకమని.. ప్రతిపక్షంగా ఉన్న సమయంలో పోరాటం చేస్తామని.. అధికారంలో ఉంటే ప్రైవేటీకరణకు అడ్డం పడతామని పేర్ని నాని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎంవైఎస్‌ జగన్‌ ప్రకటించిన విధంగా.. ఇప్పుడు స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని, కుటుంబసభ్యులకు శాశ్వత ఉద్యోగం కల్పించా లని పేర్ని నాని డిమాండ్‌ చేశారు.

మంత్రులు లోకేశ్‌, పవన్‌కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం

బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వైఎస్సార్‌ సీపీ వ్యతిరేకమని పునరుద్ఘాటన

Advertisement
 
Advertisement
Advertisement