గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు దోష రహిత ఓటర్ల జాబితా కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. దోష రహిత ఓటర్ల జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో సర్‌పై జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్‌ఎంతో కలిసి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీశ పాల్గొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సర్ ప్రక్రియలోని ఐదు దశలు, ఎన్యూమరేషన్ ఫారాల (ఈఎఫ్) అందజేత, స్వీకరణ, ఫారాల డిజిటైజేషన్, పూర్తి షెడ్యూల్ తదితర అంశాలను వివరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి ఈ నెల 14వ తేదీ వరకు సన్నద్ధత కార్యకలాపాలు జరుగుతాయని పేర్కొన్నారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్‌ఓల ద్వారా ఇంటింటి సర్వే జరుగుతుందని వివరించారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ ఉంటుందన్నారు. క్లయిమ్‌లు పరిష్కరించి ఈ ఏడాది సెప్టెంబర్ 22న తుది జాబితాను ప్రచురించడం జరుగుతుందని వివరించారు. అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. అర్హులను ఓటరు జాబితాలో ఉండేలా చేయడంతోపాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉండటం వంటి వారి ఓట్లను తొలగించి స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితా లక్ష్యంగా సర్ ప్రక్రియ చేపట్టారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, భాగస్వామ్య పక్షాల సహకారంతో ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) తప్పనిసరిగా ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ, స్వీకరణ, డిజిటైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయలని స్పష్టం చేశారు. శిక్షణ కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్‌డీఓ వెన్నెల శ్రీను పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ


