చైన్నె–కోల్‌కతా హైవే కేంద్రంగా యథేచ్ఛగా అక్రమ రవాణా
గంజాయ్‌కి
జీవనశైలిలో యోగా భాగం కావాలి
సాక్షి ప్రతినిధి,విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో చైన్నె, కోల్‌కతా హైవే గంజాయి కారిడార్‌గా మారింది. ఒడిశా, విశాఖ నుంచి నిత్యం గంజాయి తరలిస్తూనే ఉన్నారు. తరచూ పోలీసుల తనిఖీలో గంజాయి పట్టుబడుతూనే ఉంది. మంగళవారం తెల్లవారుజామున పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో పటమట పోలీసుస్టేషన్ పరిధిలోని నిడమానూరులో ఒక లారీని ఆపి తనిఖీ చేయగా అందులో గంజాయి కలిగిన బ్యాగులను గుర్తించారు. ఇందులో రూ.70లక్షల విలువైన 140 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఉమ్మడి జిల్లా పరిధిలో ఎక్కడోచోట పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడుతూనే ఉంది. మాదకద్రవ్యాలను (గంజాయి, డ్రగ్స్)సమూలంగా నిర్మూలిస్తాం, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. అంటూ రెండేళ్లుగా పాలకులు ఎక్కడ చూసినా మాటల తూటాలు పేలుస్తున్నారు. అవన్నీ ప్రచారం కోసం మాట్లాడే ఉత్తుత్తి మాటలుగానే మిగిలిపోతున్నాయి. ఎక్కడ చూసినా గంజాయి, ఇతర డ్రగ్స్ వంటివి విచ్చలవిడిగా లభిస్తుండటంతో యువత వాటి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఒకప్పుడు విజయవాడ నగరానికే పరిమితమైన ఈ విష సంస్కృతి.. ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. ప్రభుత్వ వైఫల్యంతో గంజాయి కేజీలకు కేజీలు సరఫరా అవుతూనే ఉంది. అందుకు పోలీసులకు పట్టుబడిన ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. గంజాయితో పాటు ఎండీఎంఏ డ్రగ్స్ సైతం విజయవాడలో పట్టుపడటం ప్రజలను నివ్వెర పడేలా చేస్తోంది. జాతీయ రహదారులు ఉండే పోలీసు స్టేషన్‌ల పరిధిలోనే ఎక్కువగా గంజాయి దొరకుతోంది. ఇందులో మైనర్లు కూడా ఉండటం గమనార్హం. గత రెండేళ్లలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో గంజాయి విక్రయాలు భారీగా పెరిగాయి.
గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్న వారిలో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన యువత ఉంటున్నారు. అందుకు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పదుల సంఖ్యలో యువతకు డ్రగ్స్ పాజిటివ్ రావడమే నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో 1200మందికి పైగా పాజిటివ్ రావటం గమనార్హం. దీనిని బట్టే గంజాయి, మత్తు పదార్థాల వినియోగం పెరిగిందని స్పష్టంగా అర్థం అవుతోంది. పోలీసులు డ్రగ్స్‌పై దండయాత్ర పేరుతో కఠిన చర్యలు తీసుకొంటున్నామని పేర్కొంటున్నా.. క్షేత్ర స్థాయిలో మూలాలను కూకటి వేళ్లతో పెకిలించడంలో ఘోరంగా విఫలం అవుతున్నారు.
పోలీసులకు సవాల్ విసురుతున్న స్మగ్లర్లు
భారీగా పట్టుబడుతున్నా ఆగని రవాణా
గ్రామాలకు విస్తరించిన గంజాయి గుప్పు
ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి
మత్తులో చిత్తవుతున్న యువత
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గంజాయి అమ్మకందారులు ప్రధానంగా విద్యాసంస్థలే లక్ష్యంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. జూనియర్ కాలేజీలు, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులను టార్గెట్ చేసుకొని గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. మత్తుకు బానిసలైన విద్యార్థులు విచక్షణ కోల్పోయి, ఘర్షణలకు దిగుతున్నారు. గంజాయికి అలవాటు పడిన వారు చివరకు చోరీలు, చైన్‌స్నాచింగ్‌లు వంటి నేరాలకు తెగబడుతున్నారు. పేకాట, కోడి పందేలు, క్రికెట్ బెట్టింగ్‌లకు బానిలసవుతున్నారు. ఇటీవల బైక్ దొంగతనం కేసులో అరెస్టు చేసిన నిందితుడిని పరీక్ష చేయగా, పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలా గంజాయికి అలవాటు పడిన వారు నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళ్లలో ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన బైక్‌లు చోరీ చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిలో కూడా డ్రగ్స్‌కు బానిసలైన వారు ఉంటున్నారు.


