గుడ్లవల్లేరు: మండలంలోని కౌతవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం సందర్శించారు. ఆ పాఠశాల పనుల పురోగతిపై ఆయన ఆరా తీశారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించే దిశగా చేపట్టిన చర్యల్లో భాగంగా ఆయన పాఠశాలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. దాతల సహకారంతో నిర్మిస్తున్న పలు భవనాల నిర్మాణ పురోగతి, ఒకేషనల్ భవన నిర్మాణం కోసం మెరక చేసిన స్థలాన్ని, కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించి అందుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ ఎస్‌ఈ రమణారావు, తహసీల్దార్ బి.లోకరాజు, ఎంపీడీఓ ఎండీ ఇమ్రాన్, సాగునీటి డీసీ చైర్మన్ మల్లిపెద్ది సుబ్రహ్మణ్యం, ఎంఈఓ జి.గోపాలరావు, పాఠశాల హెచ్‌ఎం రజిని కుమారి, ఇతర ఉపాధ్యాయులు ఉన్నారు.


